Andhra Pradesh : నేటి నుంచి పదో తరగతి పరీక్షలు
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. మొత్తం 6,40,916మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. మొత్తం 3,415 పరీక్ష కేంద్రాలు ఇందుకోసం ఏర్పాటు చేశారు. ఈ ఏడాది టెన్త్ విద్యార్థుల కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్లకు వెళ్లేందుకు ఇబ్బందిపడకుండా.. హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రించారు. మొబైల్‌తో స్కాన్ చేసి పరీక్ష కేంద్రం ఎక్కడుందో ఈజీగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో విద్యార్థులకు ఎగ్జామ్ సెంటర్ల విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించి క్యూఆర్ కోడ్ తీసుకొచ్చారు. పదో తరగతి హాల్‌టికెట్‌పై పరీక్షలకు సంబంధించిన వివరాలు కూడా ముద్రించారు. అలాగే రెండు పరీక్షల మధ్య సెలవులు వచ్చేలా టైం టేబుల్ ఉంది.
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం...
అంతేకాదు టెన్త్ విద్యార్థులు హాల్‌టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఆర్టీసీ బస్సుల్లో ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లడానికి ఉపయోగంగా ఉంటుంది. అంతేకాదు ఏపీ ప్రభుత్వం నిమిషం నిబంధనను కూడా పక్కన పెట్టింది. ప్రతి రోజూ పరీక్ష ఉదయం 9.30గంటలకు ప్రారంభం అవుతుంది.. మధ్యాహ్నం 12.45 వరకు కొనసాగుతుంది. అయితే ఎగ్జామ్ సెంటర్‌లలోకి విద్యార్థులను ఉదయం 8.30 గంటల నుంచే పరీక్షా కేంద్రం ఉన్న ప్రాంగణంలోకి అనుమతిస్తారని అధికారులు తెలిపారు. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే పరీక్ష ప్రారంభమైన అరగంట తర్వాత కూడా అనుమతిస్తామన్నారు. ఏప్రిల్ 4వ తేదీ నుంచి పదోతరగతి పరీక్షలకు సంబంధించిన విద్యార్థుల జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 13 వరకు మూల్యాంకన కొనసాగుతుందని అధికారులు తెలిపారు.