Ys Jagan : మొంథా తుపాను పరిహారం ఎక్కడ బాబూ?
మొంథా తుపానుతో దెబ్బతిన్న పంటలకు ఇప్పటి వరకూ ప్రభుత్వం పరిహారం చెల్లించలేదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు
మొంథా తుపానుతో దెబ్బతిన్న పంటలకు ఇప్పటి వరకూ ప్రభుత్వం పరిహారం చెల్లించలేదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొంథా తుపాను ఆర్టీజీఎస్ లో కూర్చుని తండ్రీకొడుకులు, దత్తపుత్రుడు తానే ఆపినట్లు బిల్డప్ ఇచ్చారని, కానీ నష్టపోయిన రైతుల ఊసును మాత్రం నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని వైఎస్ జగన్ అన్నారు. బీమా పథకాన్ని రద్దు చేయడం వల్ల నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఇన్ పుట్ సబ్సిడీకి కూడా ఈ ప్రభుత్వం రైతులకు ఎగనామం పెట్టిందని వైఎస్ జగన్ ఆరోపించారు. పండగలా ఉండాల్సిన వ్యవసాయాన్ని చంద్రబాబు హయాంలో దండగలా మార్చారని జగన్ ఫైర్ అయ్యారు.
పందొమ్మిది నెలల కాలంలో...
కూటమి ప్రభుత్వం ఏర్పడిన 19 నెలల కాలంలో పదిహేడు నెలలు ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయని వైఎస్ జగన్ అన్నారు. రైతులతో ముఖాముఖిలోనూ ఎప్పుడూ చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసాలు తప్పించి రైతులకు పెట్టుబడి సాయాన్ని, పరిహారాన్ని అందించే విషయంపై స్పష్టత ఇవ్వలేదన్నారు. అన్నాదత సుఖీభవ పథకం కింద ఇరవై వేలు ఇస్తామని చెప్పి అన్నదాతలను మోసం చేశారని వైఎస్ జగన్ అన్నారు.రాష్ట్రంలో 84 లక్షల మంది రైతులంటే 19 లక్షల మందికి మాత్రమే బీమా ఉందని అన్నారు. ఏ పంటకు సరైన గిట్టుబాటు ధర రావడం లేదన్నారు వైఎస్ జగన్. దిత్వా తుపాను పంట కోత సమయంలో వస్తుందని పది రోజులు ముందే వస్తుందని తెలిసినా దానిని కొనుగోలు చేయలేదని వైఎస్ జగన్ విమర్శించారు.
బాబు డైవర్షన్ డ్రామా...
కేజీ అరటి అర్ధ రూపాయికి అమ్ముడుపోతుందని అన్నారు. రైతులను ఈ ప్రభుత్వం దగా చేస్తుందని అన్నారు. చంద్రబాబు నిన్ను సీఎం చేసింది గాడిదలు కాయడానికా? అని వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు పాలనలో రైతులను దళారులు దోచుకుంటున్నారని అన్నారు. సూపర్ సిక్స్ హామీలను ఇప్పటి వరకూ అమలు చేయలేదని అన్నారు. రైతన్నా మీ కోసం అనేది చంద్రబాబు డైవర్షన్ డ్రామా అని వైఎస్ జగన్ తెలిపారు. నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఇస్తామని ఇంత వరకూ ఇవ్వలేదని, ఆడబిడ్డ పథకం కింద 1500 ఇస్తామని చెప్పి ఎగ్గొట్టి.. సూపర్ సిక్స్ హామీలను అమలు చేశామని చెప్పడానికి సిగ్గుండాలంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లికి వందనంలో ఇస్తామన్న అందరికీ ఇవ్వలేదన్నారు. ఆరోగ్య శ్రీని పూర్తిగా ఎత్తేశారన్నారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకాన్ని అమలు చేయడం లేదని అన్నారు.