Ys Jagan : చంద్రబాబుకు వైఎస్ జగన్ ఘాటు లేఖ
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘాటు లేఖ రాశారు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘాటు లేఖ రాశారు. కృష్ణా జలాల వైఫల్యాలపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును వైఎస్ జగన్ ఈ లేఖలో ప్రస్తావించారు. మొత్తం తొమ్మిది పేజీల లేఖను వైఎస్ జగన్ రాశారు.ట్రైబ్యునల్ లో రాష్ట్ర ప్రభుత్వం తమ వాదనలను గట్టిగా వినిపించాలని కోరారు. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ట్రైబ్యునల్ లో మాట్లాడాలన్నారు. లేకుంటే కృష్ణా నదిలో ఏపీ రైతుల తమ హక్కులను కోల్పోయే అవకాశముందని హెచ్చరించారు.
రైతుల ప్రయోజనాలను కాపాడాలంటూ...
తెలంగాణకు కృష్ణా నదిలో 763 టీఎంసీలు కేటాయించేందుకు ట్రైబ్యునల్ అంగీకరిస్తే ఏపీ రైతులకు తీవ్ర నష్టం ఏర్పడుతుందన్నారు వైఎస్ జగన్. రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వం తమ వాదనలను వినిపించాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు. రాయలసీమ ప్రాజెక్టుల పట్ల టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని లేఖలో జగన్ పేర్కొన్నారు. 1996లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలోనే ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.25 మీటర్లకు పెంచే పనులు ప్రారంభమయ్యాయన్న విషయాన్ని ఆయన లేఖలో వైఎస్ జగన్ గుర్తు చేశారు. ఏపీ రైతుల హక్కులకు ముప్పు ఏర్పడకుండా తగిన రీతిలో ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వైఎస్ జగన్ చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు.