Andhra Pradesh : జాతీయ రహదారి విస్తరణకు అడ్డు తొలగినట్లేనా?

హైద రాబాద్ - మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణపై అడ్డంకులు తొలిగాయి

Update: 2026-03-21 04:36 GMT

హైదరాబాద్ - మచిలీపట్నం జాతీయ రహదారిని ఎన్టీఆర్ జిల్లాలో విస్తరించాలా వద్దా అనే అంశంపై ఈ నెలాఖరులోపు తుది నిర్ణయం తీసుకోనున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ ప్రాంత రైతులు మాత్రం ఈ విస్తరణకు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే డీపీఆర్ తయారీకి నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందన్న ప్రచారంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవసరం లేకపోయినా జాతీయ రహదారిని విస్తరించడమే కాకుండా, రైతుల భూములను తీసుకోవాలన్న ప్రయత్నానికి వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ఐదుసార్లు...
అక్కడ ఉండే రైతులు ఇప్పటికే తాము ఐదుసార్లు భూములిచ్చామని, మరొకసారి ఉన్న భూములను ఎలా పొగొట్టుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై భాగస్వాముల సమావేశంలో ప్రజా ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జాతీయ రహదారుల విభాగాన్ని సంప్రదించగా, ఈ నెలాఖరులోపు తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న రహదారిలో మలుపులు ఎక్కువగా ఉన్నాయని, కొత్తగా ఏర్పాటు చేసే దారిలో తక్కువ ఉంటాయని ఉద్దేశంతో ప్లాను రూపొందించినట్లు వివరించారు. అయితే పరిటాల బైపాస్ రోడ్డు విస్తరణకు సంబంధించిన భూ యజమానులు గతంలో కోర్టులో కేసులు వేశారని, ఇప్పటికీ అవి న్యాయస్థానంలో పెండిగ్ లో ఉన్నాయని, కొత్తగా ఎదుర్కోవడం ఇబ్బంది అనే కోణంలోనూ ఎన్హెహెచ్ఎఐ అధికారులు ఆలోచిస్తున్నట్లు కూడా చెబుతున్నారు.
ఇళ్లు కూడా పోతాయంటూ...
మరోవైపు పాత రహదారి వెంబడి విస్తరణ వల్ల ఇళ్లు ఎక్కువగా పోతాయని, ఇది మరింత తమకు ఇబ్బంది కలిగిస్తుందని ఆ ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు మాత్రం కొత్తగా మరోసారి భూములు తీసుకుంటే తాము రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తు చేస్తున్నారు. రైతులు కూడా నిరసనలకు సిద్ధమవడం, ప్రజా ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేయడంతోపాటు ఉన్నతాధికారులు పునరాలోచనలో పడ్డారు. అయితే ప్రస్తుతం ఉన్న రహదారిలో ఇళ్లకు ఇబ్బంది లేకుండా రోడ్డును విస్తరించాలనే ఆలోచన కూడా చేస్తున్నారు. కొత్తరోడ్డు నిర్మిస్తే మాత్రం కృష్ణానది బఫర్ జోన్ దెబ్బతింటుందని రైతులు చెబుతున్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ అధికారులతో వాదనలు పెట్టుకున్నారు. ఉన్న రహదారిని వెడల్పు చేస్తే సరిపోతుందని కొత్త రహదారి నిర్మాణం ఎందుకని వసంత ప్రశ్నించారు.పరిటాల ఇబ్రహీంపట్నం కొత్త జాతీయ రహదారికి మార్గం సుగమం అయినట్లు సమాచారం. ఇటీవల స్టేక్ హోల్డర్ల సమావేశంలో వ్యతిరేకించిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ విజయవాడ లో జరిగిన సమావేశంలో అంగీకరించారు. రోడ్డు వేయక తప్పదని వసంత కృష్ణ ప్రసాద్, తంగి రాల సౌమ్య, ఎంపీ కేశినేని చిన్ని చెప్పడంతో త్వరలోనే పనులు ప్రారంభం ఇప్పుడున్న జాతీయ రహదారికి ఉత్తరం వైపుగా కొత్త రోడ్డు వేయనున్నారు.


Tags:    

Similar News