Chiranjeevi : చిరు చేసిన వ్యాఖ్యలు పవన్ ను ఇబ్బంది పెట్టాయా?
మెగాస్టార్ చిరంజీవి తన సోదరుడు పవన్ కల్యాణ్ ను ఇబ్బందుల్లోకి నెట్టినట్లే కనిపిస్తుంది
మెగాస్టార్ చిరంజీవి తన సోదరుడు పవన్ కల్యాణ్ ను ఇబ్బందుల్లోకి నెట్టినట్లే కనిపిస్తుంది. ఇటీవల గద్దర్ ఫిలిం అవార్డుల సందర్భంగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు కంటే పవన్ కల్యాణ్ కే ఎక్కువ నష్టమన్న కామెంట్స్ వెలువడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పై సుతిమెత్తంగా విమర్శలు చేసినా సినీరంగానికి చెందిన పవన్ కల్యాణ్ ఏపీలో ఉప ముఖ్యమంత్రిగా ఉండి కనీసం సినీ రంగం కోసం పనిచేయకపోతే ఎలా అన్నది ఆయన పరోక్షంగా అన్నట్లు అర్థం వచ్చినట్లుంది. నిజానికి చిరంజీవి సినీ రంగానికి సంబంధించి ఈ అవార్డుల ఫంక్షన్ లో పక్క రాష్ట్రం కొంత వెనక బడి ఉందని మాత్రమే అన్నారు.
సోషల్ మీడియాలో...
అయితే ఇది సోషల్ మీడియాలో పెద్దయెత్తున ట్రోల్ అవుతున్నాయి. సినిమా లాభాలన్నీ ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే వస్తున్నాయని, అయితే అక్కడ కనీసం సినిమా షూటింగ్ లను నిర్వహించడం కాని, ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి పాటుపడటం చేయకపోవడం ఏంటని సినీ పెద్దలనే టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ కు దిగుతున్నారు. అత్యధిక రాబడి ఏపీ నుంచి వస్తున్నప్పటికీ అక్కడ షూటింగ్ లు చేయకోవడంతో పాటు ఏపీ లో కనీసం థియేటర్లను కూడా నిర్మించే పరిస్థితి లేదని, స్టూడియోల నిర్మాణానికి కూడా పూనుకోలేదని అంటున్నారు.
పవన్ ఏడాది క్రితం ప్రకటించినా...
మరొకవైపు పవన్ కల్యాణ్ దాదాపు ఏడాది క్రితం ఏపీ ఫిలిం డెవలెప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి ఏ ఎం రత్నం పేరును సిఫార్సు చేస్తానని బహిరంగంగా ప్రకటించారు. అయితే ఇప్పటి వరకూ అది అమలుకు నోచుకోలేదు. మరొకవైపు పవన్ కల్యాణ్ తో పాటు ఎమ్మెల్యేగా, ప్రభుత్వంలోనూ నందమూరి బాలకృష్ణ కూడా కీలకంగా ఉన్నారని, ఇంత వరకూ సినీ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలవకపోవడం ఏంటన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. నంది అవార్డులే కాదు... అక్కడ ఫిలిం డెవలెప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కూడా భర్తీ చేయలేదు. దీంతో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఎవరికి సూటిగా తగులుతాయని అనుకుంటే... మాత్రం అందరికీ అంటున్నారు విశ్లేషకులు. ఎవరి అభిమానులు వారు తమకు అనుకూలంగా పోస్టుల పెడుతున్నారు.