Ys Jagan at statue of social justice : ఈ పెత్తందారులతో పోరాటం చేయాలంటే ప్రతి ఒక్కరూ అంబేద్కర్ కావాల్సిందే

యాభై ఆరు నెలల పాలనలో అమలు చేసిన సామాజిక న్యాయం ఈ విగ్రహ రూపంలో కనిపిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు

Update: 2024-01-19 12:34 GMT

యాభై ఆరు నెలల పాలనలో అమలు చేసిన సామాజిక న్యాయం ఈ విగ్రహ రూపంలో కనిపిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. విజయవాడలోని స్వరాజ్యమైదానంలో అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ విగ్రహం స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇక విజయవాడ గుర్తుకు వస్తుందని అన్నారు. సామాజిక చైతన్యాల వాడగా ఇక విజయవాడ విరాజిల్లుతుందన్నారు. ఈ విగ్రహం పేదల హక్కులను నిరంతరం స్పూర్తినిస్తూనే ఉంటుందన్నారు. రాజ్యాంగ హక్కులనూ ఇది గుర్తుకు తెస్తూనే ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు.

పెత్తందారులతో యుద్ధం...
అంటరాని తనాన్ని స్వయంగా అనుభవించి పోరాటం చేసిన వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని అన్నారు. స్వతంత్రం వచ్చిన 77 ఏళ్ల తర్వాత కూడా నేడు అంటరానితనం ఇంకా అక్కడకక్కడ ఉందని ఆయన అన్నారు. అంబేద్కర్ చదువుకున్నది ఇంగ్లీష్ మీడియంలోనని, కానీ ఈ పెత్తందారుల పత్రిక ఒకటి తెలుగులోనే చదవుకోవాలని అంబేద్కర్ చెప్పారని రాశారన్నారు. చరిత్రను వక్రీకరించే వాళ్లు ఈ స్థాయికి దిగజారంటే ఏ స్థాయికి పాత్రికేయం పడిపోయిందని బాధవస్తుందని జగన్ అన్నారు. ఇలాంటి ఆలోచనలు కూడా రూపం మార్చుకున్న అంటరానితనమేనని జగన్ అన్నారు. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియంను దూరం చేసే కుట్ర జరుగుతుందన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్దదైన....
ఈ విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్ద అంబేద్కర్ విగ్రహమని జగన్ అన్నారు. మరణం లేని మహానేత అంబేద్కర్ అని ఆయన కొనియాడారు.పోరాటానికి రూపమే అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ భావజాలం ఈ పవన్, చంద్రబాబులకు అస్సలు నచ్చదని అన్నారు. చంద్రబాబుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై ప్రేమ లేదని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 31 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పేదలకు ఇచ్చామని ఆయన తెలిపారు. ఈ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అన్ని రంగాల్లో న్యాయం జరిగేలా అడుగులు పడ్డాయని వైఎస్ జగన్ అన్నారు. కీలక పదవుల్లోనూ వారినే నియమించుకోగలిగామని తెలిపారు. చంద్రబాబు కనీసం అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయలేకపోయారన్నారు. అందుకు మనసు కూడా ఆయనకు రాలేదని జగన్ విమర్శించారు.

ప్రభుత్వంపై బురద చల్లేందుకు...
ఈ ఐదేళ్లలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. ఇలాంటి సామాజికన్యాయం మరే ప్రభుత్వంలోనైనా చూశారా? అని జగన్ ప్రశ్నించారు. రెండు లక్షల నలభై ఏడు వేల కోట్ల రూపాయలను బటన్ నొక్కి నేరుగా పేదలకు అందించామని తెలిపారు. రాష్ట్రాన్ని దోచుకునే మనస్తత్వం ఉన్న పెత్తందారీ నేతలకు ఏనాడైనా మనసు వచ్చిందా? అని నిలదీశారు? ఏ రోజైనా బటన్ నొక్కాలని అనిపించిందా? అని ఆయన ప్రశ్నించారు. పేదకులాల వారు ఎప్పటికీ సేవకులుగానే ఉండిపోవాలనే మనస్తత్వం ఉన్న వారు మన ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. పేదలు ప్రయాణించే ఆర్టీసీని కూడా నిర్వీర్యం చేయాలనుకున్నారన్నారు.


Tags:    

Similar News