Ys Jagan : జనంలోనే జగన్.. నిర్ణయం తీసుకుంది అందుకేనట
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలకు మంచి స్పందన లభిస్తుండటంతో ఇక ప్రజల్లో ఉండాలని జగన్ ను నేతలు కోరుతున్నారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలకు మంచి స్పందన లభిస్తుండటంతో ఇక ప్రజల్లో ఉండాలని జగన్ ను నేతలు కోరుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికలు జరిగి రెండేళ్లు కావస్తుండటంతో వైసీపీకి హనీమూన్ పీరియడ్ ముగిసిందంటున్నారు. ఇప్పుడు కూడా అడపా దడపా వచ్చి ప్రజలను కలుసుకోవడం బాగా లేదని కొందరు వైసీపీ సీనియర్ నేతలే అభిప్రాయపడుతున్నారు. బెంగళూరు నుంచి మకాం మార్చేసి జగన్ తాడేపల్లిలోనే ఉంటూ నిత్యం ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచిస్తున్నారు. అప్పుడే క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, ప్రస్తుతం పాజిటివ్ వేవ్ ఉన్న కారణంగా జగన్ దానిని చెడగొట్టుకునే ప్రయత్నం చేయవద్దని కూడా సూచిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో...
మరొకవైపు త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు దూరంగా వైసీపీ ఉంటుందన్న ప్రచారాన్ని పార్టీ నేతలు ఖండిస్తున్నారు. గెలిచినా, ఓటమి పాలయినా స్థానిక సంస్థల ఎన్నికల బరిలో ఉంటామని చెబుతున్నారు. పోటీ లేకుండా చేసి ఎన్నికలను ఏకగ్రీవం చేయడం వల్ల టీడీపీకి అదనపు బలం తమకు తామే సమకూర్చినట్లవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. జగన్ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపి తాడోపేడో తేల్చుకోవాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. లేకుంటే ద్వితీయ శ్రేణి నేతలు నీరుగారిపోతారని, క్యాడర్ కూడా పార్టీకి దూరమవుతుందన్న భావనలో జగన్ ఉన్నారు. అందుకోసమే ఇక జనంలోనే ఉండాలని జగన్ కూడా భావిస్తున్నారు.
జిల్లాల వారీగా పర్యటనలు...
సమస్యల వారీగా జిల్లాల పర్యటన చేయాలని ఆయన భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏదో ఒక సమస్య మీద ప్రతి జిల్లాలో నెలకు రెండు రోజుల పాటు టూర్ చేయాలన్న ప్లాన్ లో జగన్ ఉన్నారని తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలు జనవరి నెలలో జరిగే అవకాశముండటంతో అందుకు రెండు, మూడు నెలల కూడా సమయం లేకపోవడంతో ఇక జిల్లాల పర్యటనకు జగన్ రెడీ అవుతున్నారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఈ పర్యటనలతో పార్టీలో హైప్ రావడమే కాకుండా జనంలో కూడా జగన్ ఉన్నారన్న సంకేతాలు వెళతాయని, అధికార పార్టీ అక్రమ అరెస్ట్ లు కూడా ఎండగట్టే అవకాశముంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. టూర్ షెడ్యూల్ ను సిద్ధం చేయాలని పార్టీ నేతలను జగన్ కోరినట్లు తెలిసింది. ఇక 2027లో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయడానికి కూడా సిద్దమయ్యారు. ఇందుకోసం ఆయన ముందుగా జిల్లాలు తిరిగి క్యాడర్ ను, లీడర్లను మోటివేట్ చేయనున్నారని తెలిసింది.