Andhra Pradesh : ఏపీలో శాంతి భద్రతల వైఫ్యల్యానికి ఎవరు కారణం?

శాంతి భద్రతల వైఫల్యం ఏ ప్రభుత్వానికైనా చెడ్డపేరు తెస్తుంది.

Update: 2026-02-02 07:58 GMT

శాంతి భద్రతల వైఫల్యం ఏ ప్రభుత్వానికైనా చెడ్డపేరు తెస్తుంది. ఎన్ని మంచి పనులు చేసినా.. ఎన్ని సంక్షేమ పథకాలను అమలు చేసినా శాంతిభద్రతల సమస్య మాత్రం ప్రజల్లోకి తొందరగా చొరబడుతుంది. గత వైసీపీ ప్రభుత్వంలోనూ అదే జరిగింది. నాడు జగన్ ప్రభుత్వం టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించడంతో పాటు చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడంతో పాటు అనేక రకాలుగా లా అండ్ ఆర్డర్ సమస్య ఆ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోవడానికి కారణమయింది. ఇప్పుడు అదే సమస్య కూటమి ప్రభుత్వంలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఘర్షణలు, హత్యలు, అత్యాచారాలు ప్రభుత్వానికి చెడ్డపేరును తెచ్చిపెడుతున్నాయి.

శాంతి భద్రతలు...
నియోజకవర్గాల స్థాయిలో శాంతి భద్రతలు అదుపు తప్పడంపై వాటి ప్రభావం రానున్న ఎన్నికల్లో పడే అవకాశముందన్న ఆందోళన సీనియర్ నేతల్లోనూ వ్యక్తమవుతుంది. అందులో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే ప్రజలకు తెలిసిపోతుంది. పోలీసులు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ పోలీసుల తీరు కూడా ఆక్షేపణీయంగానే కనిపిస్తుంది. ఎవరి నుంచి వచ్చిన ఆదేశాలు మాత్రమే తెలియదు కానీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ల ఇళ్లపై దాడులు జరిగిన సమయంలో పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరించడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. ఇంత బీభత్సం జరుగుతున్నా పోలీసులు పట్టనట్లు వ్యవహరించడాన్ని బట్టి చూస్తే శాంతిభద్రతల పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
వివాదానికి కారణమైన ఫ్లెక్సీలను...
అసలు వివాదానికి కారణమైన ఫ్లెక్సీలను ముందుగానే పోలీసులు తొలగించి ఉంటే ఇంత రచ్చ జరిగి ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. రెండు రాజకీయ పార్టీల మధ్య పోరు ఉన్న సమయంలో వివాదాస్పద ఫ్లెక్సీలను పెడితే ఖచ్చితంగా అక్కడ శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని చెప్పాలి. ఆ మాత్రం కూడా తెలియకుండా పోలీసు శాఖ నిద్రమత్తులో జోగుతుండటాన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. ఆరోజు ఫ్లెక్సీని తొలగించి ఉంటే ఇటు టీడీపీ, అటు వైసీపీ నేతల మధ్య ఘర్షణ తలెత్తి ఉండేది కాదని, అలాగే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసిన వారిపై కేసులు పెడితే జోగి రమేష్ ఇంటిపై దాడికి సాహసించి ఉండే వారు కాదన్నది కూడా అంతే వాస్తవమని న్యాయవాదులు కూడా చెబుతున్నారు. ఏపీలో జరుగుతున్న ఈ వివాదాలకు పోలీసుల వైఫల్యమే కారణమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది.


Tags:    

Similar News