Ys Jagan : జగన్ మారలేదా.. పదకొండు సీట్లకు పరిమితమయినా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కోటరీ నుంచి బయటకు రాలేదని పిస్తుంది

Update: 2025-11-11 09:07 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కోటరీ నుంచి బయటకు రాలేదని పిస్తుంది. కేవలం పదకొండు సీట్లకే పరిమితమయినప్పటికీ జగన్ మాత్రం అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరునే అవలంబిస్తున్నారన్న అభిప్రాయం కలుగుతుంది. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. ఏ నిర్ణయం తీసుకున్నా తప్పని సరి పరిస్థితుల్లో అమాత్యుల నుంచి నేతల వరకూ తలూపి ఉండవచ్చు. పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి కోఆర్డినేటర్ల నియామకం నుంచి నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాల వరకూ ఏ మాత్రం పరిష్కారానికి జగన్ చొరవ చూపలేదు.అది కూడా వైసీపీ ఓటమికి ఒక కారణమని చెప్పక తప్పదు. కేవలం కోటరీ నేతల నివేదికలపైనే ఆధారపడి పార్టీని నడిపారు.

గ్యాప్ కొనసాగుతూనే...
ఒక రకంగా పార్టీని అసలు పూర్తిగా పట్టించుకోలేదు. తాను ప్రభుత్వంలో ఉన్న ఐదేళ్ల పాటు మళ్లీ అధికారంలోకి తనవల్లే రావాలని అనేక సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్లారు. కానీ ఆ ప్రయోగం బూమ్ రాంగ్ అయింది. అధికారం కోల్పోయిన తర్వాత ఆయనలో మార్పు వస్తుందని భావించిన నేతలకు నిరాశే ఎదురవుతుంది. ఎందుకంటే రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో నేతలకు, ద్వితీయ శ్రేణి నేతలకు మధ్య గ్యాప్ ఇంకా కొనసాగుతుంది. వాటిని పరిష్కరించేందుకు మాత్రం జగన్ చొరవ చూపడం లేదు. కనీసం జిల్లాల వారీగా సమావేశాలను ఏర్పాటు చేసి ముఖ్య నేతలను పక్కన పెట్టి ద్వితీయ శ్రేణి నేతల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు.
అనేక జిల్లాల్లో నేతల మధ్య...
ఇప్పటికీ కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కొందరి ఆధిపత్యమే పార్టీలో నడుస్తుంది. పార్టీకేంద్ర కార్యాలయంలోనూ కోటరీ పెత్తనం ఇంకా కనిపిస్తుంది. ఇప్పటికీ జగన్ వాస్తవ పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదన్న అభిప్రాయం వినిపిస్తుంది. దీంతో నేతలు కూడా జగన్ బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చినప్పటికీ నేతలు వచ్చి కలిసే ప్రయత్నం కూడా చేయడంలేదు. వచ్చినా కోటరీ అడ్డుకుంటుందని భావించి వారు తమ నియోజకవర్గాల్లో మౌనంగా ఉన్నారు. ఇప్పటికైనా జగన్ సరైన నిర్ణయం తీసుకోకుంటే పార్టీ ఎదుగుదల అనేది జరగదన్నది సుస్పష్టం.


Tags:    

Similar News