YSRCP : మళ్లీ నా బొమ్మే గెలిపిస్తుందని జగన్ అనుకుంటున్నట్లుందిగా?
వైసీపీ అధినేత జగన్ కు ఒక అభిప్రాయం మాత్రం మైండ్ లో నుంచి ఇంకా పోలేదు.
వైసీపీ అధినేత జగన్ కు ఒక అభిప్రాయం మాత్రం మైండ్ లో నుంచి ఇంకా పోలేదు. దారుణమైన ఓటమి తర్వాత కూడా జగన్ మాత్రం ఆ మైండ్ సెట్ ను మార్చుకోవడం లేదు. అదే తన బొమ్మతోనే గెలుస్తారనుకోవడం. అది జగన్ భ్రమ. 2019లో గెలిచింది తనవల్లనేనన్న భ్రాంతి నుంచి జగన్ ఇంకా బయటపడటం లేదు. నాడు జగన్ పార్టీ గెలుపునకు అనేక కారణాలున్నాయి. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేయడం, జనసేన మరో కూటమితో జట్టు కట్టడం, బీజేపీ సొంతంగా పోటీ చేయడం ఇలా జగన్ కు 2019 ఎన్నికలు అలా కలసి వచ్చాయి. జగన్ పాదయాత్ర కొంత మేరకు పనిచేసి ఉండవచ్చు. కానీ నియోజకవర్గాల్లో అభ్యర్థులే జయాపజయాలకు కీలకమని ఎన్నో ఎన్నికలు తేల్చి చెప్పాయి.
కులాల వారీగా చీలిపోయి...
ఆంధ్రప్రదేశ్ అందులోనూ విభజన తర్వాత పూర్తిగా కులాల వారీగా చీలిపోయింది. సామాజికవర్గాల వారీగా ఓటర్లు చీలిపోయి ఉన్నారు. అలాగని ప్రతి సామాజికవర్గంలో గంపగుత్తగా ఓటర్లు జగన్ కే పట్టం కట్టరు. చంద్రబాబుకు కూడా జై కొట్టరు. కానీ స్థానికంగా వారికి అందుబాటులో ఉండే ఎమ్మెల్యే అభ్యర్థులే కీలకమవుతారు. మొన్నటి ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లు మాత్రమే రావడానికి జగన్ ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలు యాభై శాతం ఉంటే.. మిగిలిన యాభై శాతం ఓటమి స్థానిక ఎమ్మెల్యేల పనితీరుపైనే ఉందన్నది కూడా వాస్తవం. అందుకే ఎమ్మెల్యే అభ్యర్థులే కీలకం. పార్టీ, పార్టీ అధినేత పది శాతం వరకూ మాత్రమే విజయానికి ప్లస్ గా మారతారు.
పాదయాత్ర చేసినందున...
మిగిలిన విషయాల్లో మాత్రం స్థానిక రాజకీయాలే ప్రభావితం చేస్తాయి. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించడం, స్థానికంగా ఉండే సమస్యలపై గళం విప్పడం, వారి వ్యక్తిగత సమస్యలను సత్వరమే పరిష్కరించడం, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ లంచాల బారిన పడటం వంటివి ఎక్కువగా ఎన్నికల్లో ప్రభావితం చేస్తాయి. అందుకే వైసీపీ అధినేత జగన్ కూడా తాను మళ్లీ పాదయాత్ర చేస్తే అధికారంలోకి వస్తామని అనుకోవడం ఒక రకంగా పార్టీకి తన బొమ్మే ఫైనల్ అని తేల్చి చెప్పడమేనంటున్నారు. పాదయాత్ర వల్లనే గతంలో కొందరు అధికారంలోకి ఉండివచ్చు. కానీ కేవలం పాదయాత్ర వల్లనే అధికారంలోకి రారన్నది కూడా అనేక రాష్ట్రాల్లో స్పష్టమయింది. బీహార్ లో ప్రశాంత్ కిషోర్, మధ్యప్రదేశ్ లో నాడు దిగ్విజయ్ సింగ్ పాదయాత్రలు చేసినా అధికారంలోకి రాలేకపోయిన విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా నియోజకవర్గ స్థాయిలో మంచి నాయకత్వాన్ని ఎంపిక చేయడమే విజయానికి అసలు మార్గమని పలువురు సూచిస్తున్నారు.