YSRCP : కూటమి కలసి ఉన్నా గెలుపు పై జగన్ లో ధీమా.. అదే కారణమట
వైసీపీ అధినేత జగన్ కు హోప్స్ పెరుగుతున్నాన్నది ఆ పార్టీ నేతల నుంచి అందుతున్న సమాచారం
వైసీపీ అధినేత జగన్ కు హోప్స్ పెరుగుతున్నాన్నది ఆ పార్టీ నేతల నుంచి అందుతున్న సమాచారం. వచ్చే ఎన్నికల్లో గెలుపు తధ్యమని రెండేళ్లకే అర్థమయిందని నేతలు చెబుతున్నారు. కూటమి పార్టీలు ఈసారి కలసి పోటీ చేసినా తిరుగులేని విజయంతో ఈసారి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన పదే పదే చెప్పడం వెనక ఉన్న ధీమాకు కూడా బలమైన కారణముందని అంటున్నారు. అందుకోసమే ప్రతి సమావేశంలో జగన్ వచ్చేది మన ప్రభుత్వమే అన్న మాటను పదే పదే చెబుతుండటంతో పాటు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పడం కూడా అందులో భాగంగానేనన్నది సీనియర్ నేతల నుంచి వినిపిస్తున్న మాట.
అగ్రనేతలు మాత్రమే...
కూటమి పార్టీలు 2029 ఎన్నికల్లోనూ కలిసే పోటీ చేస్తాయి. అయితే కూటమి పార్టీలో కేవలం అగ్రనేతలు మాత్రమే కలసి ఉంటారు. కాని కింది స్థాయి నేతలు కలసి ఉండరన్న గట్టి నమ్మకతో వైసీపీ అధినేత జగన్ ఉన్నట్లు కనిపిస్తుంది. అదే జగన్ ప్రధానమైన ధీమా. ఇప్పటికే మూడు పార్టీల ద్వితీయ శ్రేణి నేతలతో పాటు సీనియర్ నేతలు, ముఖ్య కార్యకర్తలకు తమకు కూటమి ప్రభుత్వంలో ప్రాధాన్యత, పదవులు దక్కడం లేదన్న అసంతృప్తితో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో అది ఒక్కటి మన గెలుపుకు చాలదూ? అని జగన్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం. కూటమి పార్టీలు కలసి పోటీ చేయకపోయినా ఈసారి విజయం తమదేనన్న ధీమాకు ప్రధాన కారణం అదేనంటున్నారు.
కులాల పరంగా చూసినా...
అలాగే సంక్షేమ పథకాల్లో కోతలు, రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు రాకపోవడం వంటివి తమకు ప్రధాన వర్గాలు కలసి వస్తాయని కూడా జగన్ నేతలతో చెబుతున్నారని అంటున్నారు. అలాగే ఇక ఆంధ్రప్రదేశ్ లో ప్రధానమైదని కుల రాజకీయాలు. ఈసారి అవే తమకు రక్షణగా నిలుస్తాయని జగన్ గట్టిగా విశ్వసిస్తున్నారు. 2024 ఎన్నికల్లో కూటమి పార్టీకి వెన్నంటి నిలిచిన కొన్ని ముఖ్యమైన సామాజికవర్గాలు ఈసారి తమనే ఆప్షన్ గా ఎంచుకుంటారని, ఆ సామాజికవర్గం నేతలు చెప్పిన మాటలు ఆ కులానికి చెందిన ఓటర్లు వినే పరిస్థితి ఉండదని కూడా నమ్ముతున్నారని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ఇలా ఎటూ చూసినా.. కూటమి కలసి ఉన్నా తమకు నష్టం ఏమీ లేదన్న లెక్కల్లో జగన్ ఉన్నారని, అందుకే తరచూ గెలుపు తమదేనన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారని నేతలు చెబుతున్నారు.