Breaking : మిధున్ రెడ్డికి రిమాండ్
వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు.
వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. మిధున్ రెడ్డికి న్యాయమూర్తి ఆగస్టు ఒకటోతేదీ వరకూ రిమాండ్ విధించారు. అంతకు ముందు మిధున్ రెడ్డికి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. నిన్న మధ్యాహ్నం సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయిన మిధున్ రెడ్డిని దాదాపు ఎనిమిది గంటల పాటు విచారించిన తర్వాత రాత్రి అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. రాత్రంతా సిట్ కార్యాలయంలోనే మిధున్ రెడ్డిని ఉంచారు. ఆసుపత్రి వద్ద, కోర్టు వద్ద భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు. వైసీపీ నేతలు తరలివస్తున్నారని తెలిసి భారీగా పోలీసులను మొహరించారు. రిమాండ్ విధించడంతో మిధున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే అవకాశముంది.
ఏసీబీ కోర్టులో...
అయితే ఈరోజు ఆదివారం కావడంతో మిధున్ రెడ్డిని న్యాయమూర్తి ఎదుట విచారణకు హాజరు పర్చాలని భావించారు. కానీ న్యాయమూర్తి తాను న్యాయస్థానానికి వస్తానని చెప్పడంతో ఏసీబీ కోర్టుకు తరలించారు. మిధున్ రెడ్డిని తమ కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోరనున్నారు. విచారణలో తమకు సహకరించలేదని, కస్టడీకి అప్పగించాలని కోరనున్నారు. అదే సమయంలో మిధున్ రెడ్డి తరుపున న్యాయవాదులు రిమాండ్ పై పెద్దగా అభ్యంతరం చెప్పకపోయినా, మిధున్ రెడ్డి భద్రత, హెల్త్, ములాఖత్ విషయాల్లో పిటీషన్లు వేశారు. ఆయన ఆరోగ్య సమ్యలను దృష్టిలో ఉంచుకుని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్సకు అనుమతి ఇవ్వాలని మిధున్ రెడ్డి తరుపున న్యాయవాదులు కోరారు. దీంతో పాటు ఎంపీ కావడతో జైలులో భద్రతతో పాటు స్పెషల్ బ్యారక్ ను కూడా ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అని వాదించారు. మిధున్ రెడ్డికి వై కేటగిరీ భద్రత ఉందని తెలిపారు.