Ys Jagan : జగన్ ఆ ప్రస్తావన తేకపోవడానికి కారణం ఏమై ఉంటుంది చెప్మా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ దాదాపు రెండు గంటల పాటు మీడియా సమావేశం పెట్టారు. అందులో అన్ని అంశాలను ప్రస్తావించారు

Update: 2025-07-16 09:00 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ దాదాపు రెండు గంటల పాటు మీడియా సమావేశం పెట్టారు. అందులో అన్ని అంశాలను ప్రస్తావించారు. అన్నివర్గాల ప్రజలకు తాము అండగా ఉంటున్నామని చెప్పారు. కానీ ఒక్క విషయంలో మాత్రం ఆయన స్పందించలేదు. అదే ఇప్పుడు రాజకీయంగానూ, రాజధాని అమరావతిలోనూ హాట్ టాపిక్ గా మారింది. జగన్ మైండ్ సెట్ మారినట్లుందని సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి. అనేక అంశాలను ప్రస్తావించిన జగన్ రాజధాని రైతుల విషయాన్ని మాత్రం పూర్తిగా పక్కన పెట్టేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరో ఇరవై వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్ ద్వారా భూ సమీకరణకు నిర్ణయించిన నేపథ్యంలో జగన్ ఆ ప్రస్తావన లేకుండా సమావేశాన్ని ముగించారు.

అనేక సమస్యలను ప్రస్తావించి...
మిర్చి, పొగాకు, మామిడి రైతుల సమస్యలను ప్రస్తావించారు. కరేడు లో భూ సేకరణపై కూడా జగన్ మండిపడ్డారు. మూడు పంటలు పండే భూమిని ఎలా సేకరిస్తున్నారని ప్రశ్నించారు. కరేడు రైతులు తనను కలిశారని, వారికి అండగా వైసీపీ నిలబడుతుందని మీడియా సమావేశంలో చెప్పారు. కానీ రాజధాని రైతులు రెండో విడత భూ సమీకరణకు అంగీకరించకపోయినా వారి గురించి మాట్లాడకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాజధాని రైతుల పై ఆగ్రహంతోనే జగన్ వారికి మద్దతుగా మాట్లాడలేదా? లేక జగన్ తన మైండ్ సెట్ ను మార్చుకున్నారా? అన్న చర్చ జరుగుతుంది. అనేక సమస్యలపై పోరాటానికి సిద్ధమని ప్రకటించిన జగన్ రాజధాని భూముల ప్రస్తావన మాత్రం తేలేదు.
భూ సమీకరణ పై...
గతంలో అసెంబ్లీ సమావేశంలోనే రాజధాని నిర్మాణానికి ముప్ఫయి వేల ఎకరాల భూములు అవసరమా? అని ప్రశ్నించిన జగన్ ఇప్పుడు మరో ఇరవై వేల ఎకరాలు సమీకరించడానికి ప్రభుత్వం సిద్ధమయినా ఎందుకు ప్రశ్నించలేదన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తానే అంతకు ముందు అవసరమైతే మరిన్ని భూములు సేకరించాలని తాను అన్నమాటలు జగన్ కు గుర్తుకు వచ్చి ఉండవచ్చని కొందరు నెట్టింట నిలదీస్తున్నారు. అయితే ప్రభుత్వం రెండో విడత ల్యాండ్ పూలింగ్ ద్వారా భూ సమీకరణ విషయంలో కొంత వెనక్కు తగ్గినట్లు ప్రచారం జరుగుతున్నా అది తాత్కాలికమేనని, ఖచ్చితంగా భూ సమీకరణ మరో ముప్ఫయి వేల ఎకరాలను సేకరిస్తామని అధికారులు చెబుతున్నారు.
గత ఎన్నికల ముందు వరకూ...
గత ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ మూడు రాజధానుల అంశంతో జనం ముందుకు వెళ్లి బోల్తాపడ్డారు. మూడు రాజధానుల ప్రతిపాదనను మూడు ప్రాంతాల్లో జనం అంగీకరించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చి చెప్పాయి. దీంతో గత కొన్నాళ్ల నుంచి మూడు రాజధానుల అంశం జగన్ నోటి వెంట నుంచి రావడం లేదు. పైగా ఇటీవల ఆయన గుంటూరు - విజయవాడను కలుపుతూ రాజధాని నిర్మాణం చేపడితే బాగుండేదని కూడా అభిప్రాయపడ్డారంటే ఆ ప్రతిపాదనను విరమించుకున్నట్లే కనపడుతుందంటున్నారు. అందుకే జగన్ రాజధాని అమరావతి విషయంలో జరిగే విషయాలను కొంతకాలం పరిశీలించిన తర్వాత మాత్రమే రెస్పాండ్ కావాలని భావిస్తున్నట్లుంది. అందుకే రెండు గంటల పాటు జరిగిన మీడియా సమావేశంలో రాజధాని అమరావతి పేరు కూడా తేకుండా జగన్ జాగ్రత్త పడ్డారంటున్నారు.


Tags:    

Similar News