విజ‌య‌సాయిరెడ్డి మాట‌పై కొత్త చర్చ‌..! వైసీపీలో నెంబ‌ర్ - 2 ఆమేనా ?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నెంబ‌ర్ - 2 స్థానం ఎవ‌రిది అనే చ‌ర్చ అప్పుడ‌ప్పుడు తెర‌మీద‌కు వ‌స్తుంటుంది. ఒక‌సారి విజ‌య‌సాయిరెడ్డి, మ‌రోసారి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, ఇంకోసారి వైవీ సుబ్బారెడ్డి పేర్లు ఈ నెంబ‌ర్ - 2 స్థానంలో వినిపిస్తూ ఉంటాయి.

Update: 2022-05-18 04:34 GMT


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నెంబ‌ర్ - 2 స్థానం ఎవ‌రిది అనే చ‌ర్చ అప్పుడ‌ప్పుడు తెర‌మీద‌కు వ‌స్తుంటుంది. ఒక‌సారి విజ‌య‌సాయిరెడ్డి, మ‌రోసారి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, ఇంకోసారి వైవీ సుబ్బారెడ్డి పేర్లు ఈ నెంబ‌ర్ - 2 స్థానంలో వినిపిస్తూ ఉంటాయి. అయితే, పార్టీకి, ప్ర‌భుత్వానికి సంబంధించిన కీల‌క నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో వీరి పాత్ర ఉంటుంది. వీరి స‌ల‌హాల‌కు జ‌గ‌న్ ఎక్కువ‌గా ప్రాధాన్య‌త ఇస్తుంటారు. ఏదైనా కీల‌క నిర్ణ‌యం తీసుకునే ముందు వీరితో చ‌ర్చిస్తారు.

అయితే, ఈ ముగ్గురూ వైసీపీలో నెంబ‌ర్ - 2 మాత్రం కాదు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ స‌తీమ‌ణి వైఎస్ భార‌తినే వైసీపీలో నెంబ‌ర్ - 2 స్థానంలో క‌నిపిస్తున్నారు. తాజాగా, విజ‌య‌సాయిరెడ్డి చేసిన ఒక చిన్న వ్యాఖ్య ఈ విష‌యాన్ని బ‌ల‌ప‌రుస్తోంది. రెండోసారి త‌న‌ను రాజ్య‌స‌భ‌కు ఎంపిక చేయ‌డం ప‌ట్ల ఆయ‌న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌తో పాటు వైఎస్ భార‌తికి కూడా ధ‌న్య‌వాదాలు తెలిపారు. విజ‌యసాయిరెడ్డి అంత‌టి కీల‌క నాయ‌కుడే వైఎస్ భార‌తి పేరు ప్ర‌స్తావించి ధ‌న్య‌వాదాలు చెప్ప‌డం ఇప్పుడు కొత్త చ‌ర్చ‌ల‌కు దారి తీస్తోంది.

విజ‌య‌సాయిరెడ్డి మాట‌ల‌ను బ‌ట్టి ఒక విష‌యం స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. రాజ్య‌స‌భ స‌భ్యుల ఎంపిక విష‌యంలో భార‌తి పాత్ర ఉంద‌నేది తేట‌తెల్ల‌మైంది. అందుకే, ఆమెకు కూడా విజ‌య‌సాయిరెడ్డి ధ‌న్య‌వాదాలు తెలిపారు. పార్టీకి సంబంధించిన విష‌యాల్లో జ‌గ‌న్‌కు భార‌తి త‌న సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇస్తున్నార‌నే ప్ర‌చారం చాలా రోజులుగా ఉంది. గ‌వ‌ర్న‌ర్‌తో భేటీ సంద‌ర్భాల్లోనూ జ‌గ‌న్ వెంట భార‌తి క‌నిపిస్తూ ఉంటారు.

ఈ విష‌య‌మై తెలుగుదేశం పార్టీ రాజ‌కీయం కూడా చేసింది. జ‌గ‌న్ మ‌ళ్లీ జైలుకు వెళ్లాల్సి వ‌స్తే భార‌తిని ముఖ్య‌మంత్రి చేస్తార‌ని, అందుకే భార‌తిని పార్టీ, ప్ర‌భుత్వానికి సంబంధించిన వివ‌రాల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నార‌ని టీడీపీ చాలాసార్లు ఆరోపించింది. ఇదే విష‌య‌మై భార‌తి, ష‌ర్మిల మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు సైతం వ‌చ్చాయ‌ని కూడా టీడీపీ నేత‌లు చెప్పుకొచ్చారు. అయితే, గ‌తంలో భార‌తి ఎప్పుడూ రాజ‌కీయాల్లో క్రియాశీలంగా క‌నిపించ‌లేదు.

జ‌గ‌న్ వైసీపీని స్థాపించిన త‌ర్వాత సాక్షి బాధ్య‌త‌లు తీసుకోవ‌డంతో పాటు ఇత‌ర వ్యాపారాల‌ను సైతం భార‌తి స‌మ‌ర్థంగా నిర్వ‌హిస్తున్నారు. ఇటీవ‌ల మాత్రం ఆమె ప‌రోక్షంగా పార్టీకి సంబంధించిన నిర్ణ‌యాల్లో ప్ర‌భావం చూపిస్తున్నార‌నే చ‌ర్చ మొద‌లైంది. రాజ‌కీయంగా కూడా ఆమెలో చాలా ప‌రిణితి కనిపిస్తోంది. ఇటీవ‌ల ఇచ్చిన ఒక ఇంట‌ర్వ్యూలో చాలా అంశాల‌పై ఆమె స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న‌తో మాట్లాడింది. మ‌రి, రానున్న రోజుల్లో భార‌తి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌స్తారా అనేది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News