Pithapuram : వర్మకు ఛాన్స్ చేజారినట్లే...ఎలిమినేషన్ తప్పేట్లు లేదుగా?

పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్.ఎన్. వర్మ రాజకీయ ప్రస్థానం ఎటూ అర్థం కాకుండా ఉంది

Update: 2025-10-21 07:57 GMT

పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్.ఎన్. వర్మ రాజకీయ ప్రస్థానం ఎటూ అర్థం కాకుండా ఉంది. జనసేనాని పవన్ కల్యాణ్ కోసం తన స్థానాన్ని త్యాగం చేసిన వర్మకు ఇచ్చే ప్రాధాన్యత ఇదేనా? అన్న ప్రశ్న వర్మ వర్గీయుల నుంచి వినపడుతుంది. పిఠాపురం నియోజకవర్గాన్ని పవన్ కల్యాణ్ దాదాపు ఫిక్స్ చేసుకున్నట్లే కనపడుతుంది. పిఠాపురం నియోజకవర్గాన్ని పవన్ వదలిపెట్టే అవకాశం ఎంత మాత్రం లేదు. ఎందుకంటే పవన్ తన అడ్డాగా నియోజకవర్గాన్ని మార్చుకుంటున్నారు. నిజానికి పవన్ కల్యాణ్ ఎన్నికయిన తర్వాత ఈ నియోజకవర్గానికి కొంత ఇమేజ్ ఏర్పడింది. అక్కడ భూముల ధరలు కూడా పెరిగాయి. అదేసమయంలో అక్కడ ఓటు బ్యాంకు కూడా పవన్ అక్కడే ఫిక్స్ అయ్యేలా చేసేటట్లే కనపడుతుంది.

హామీ నిలబెట్టుకోవాలని...
మరి మాజీ ఎమ్మెల్యే వర్మ పరిస్థితి ఏంటన్నది మాత్రం ఎటూ తేలకుండా ఉంది. వర్మ పిఠాపురం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన నేత కావడంతో పాటు టీడీపీలో కూడా కీలకమైన నేత. 2024 ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ కోసం త్యాగం చేసినందుకు వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని అప్పుడే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. కూటమి ధర్మంతో పాటు జగన్ ను ఓడించాలన్న లక్ష్యంతో వర్మ కూడా పవన్ కల్యాణ్ విజయానికి కృషి చేశారు. అంతవరకూ బాగానే ఉంది కానీ, కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత మాత్రం పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన స్థానిక నేతల మధ్య మాత్రం సఖ్యత లేదు. టీడీపీ నేతలను కట్టడి చేశామని చెప్పినప్పటికీ వర్మకు ఎలాంటి పదవి రాకపోవడం కొంత అసంతృప్తి వర్మ అనుచరుల్లో ఉంది.
భవిష్యత్ లోనూ...
ఇక ఇటీవల మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్యలపై కూడా వర్మ అనుచరులు గరంగరంగా ఉన్నారట. నారాయణ తాను ఆ మాట అనలేదని సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వర్మను జీరో చేశామని టీడీపీ చెప్పడం వెనక ఇక భవిష్యత్ లో ఏ పదవి దక్కదని చెప్పకనే చెప్పినట్లయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వర్మకు అక్కడ ఎమ్మెల్సీ పదవో మరే పదవి ఇచ్చినా పిఠాపురం నియోజకవర్గంలో మరో పవర్ సెంటర్ ఏర్పడుతుందని, అప్పుడు పవన్ కల్యాణ్ కు, తమకు గ్యాప్ ఏర్పడే అవకాశముందని పార్టీ నాయకత్వం వర్మకు భవిష్యత్ లోనూ ఏ పదవి దక్కే అవకాశముండకపోవచ్చని అంటున్నారు. మొత్తం మీద ఈ టర్మ్ లో మాత్రం వర్మ మాజీ ఎమ్మెల్యేగానే మిగిలిపోక తప్పదంటున్నారు.


Tags:    

Similar News