Vasireddy Padma : వాసిరెడ్డి పద్మను ఎవరూ దరిదాపుల్లోకి రానివ్వడం లేదా?

వైసీపీ నుంచి రాజీనామా చేసిన వారిని పార్టీలోకి తీసుకోవడానికి టీడీపీ పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

Update: 2025-11-19 07:02 GMT

వైసీపీ నుంచి రాజీనామా చేసిన వారిని పార్టీలోకి తీసుకోవడానికి టీడీపీ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వైసీపీ అధికారం కోల్పోయిన వెంటనే మాజీ మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. అయితే ఆమె ఇప్పటి వరకూ ఏ పార్టీలోనూ చేరలేదు. త్వరలో టీడీపీలో చేరబోతున్నట్లు వెంటనే ప్రకటించారు. గత ఏడాది డిసెంబరు నెలలో ఆమె రాజీనామా చేసినప్పటికీ ఇంత వరకూ టీడీపీలో వాసిరెడ్డి పద్మ టీడీపీలో చేరలేదు. డిసెంబరు నెలాఖరులోనే చేరాల్సిన వాసిరెడ్డి పద్మ టీడీపీ లో చేరలేకపోయారు. అయితే వాసిరెడ్డి పద్మ చేరికకు టీడీపీ నేతలు అభ్యంతరం పెద్దయెత్తున చెప్పారని తెలిసింది. వాసిరెడ్డి పద్మ మాటకారి. మంచి సబ్జెక్టు ఉన్న నేతగా పేరు. ప్రజారాజ్యం నుంచి ఆమె పార్టీకి అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. ప్రజారాజ్యంలోనూ ఎక్కువ రోజులు ఉండలేదు. తర్వాత ఆమె వైసీపీలో చేరి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు.

జగన్ కేబినెట్ ర్యాంకు పదవి ఇచ్చినా...
కానీ వైఎస్ జగన్ మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ పదవి వరకే వాసిరెడ్డిని పరిమితం చేశారు. తనకు జగన్ అన్యాయం చేశారని, జగన్ తనకు చాలా బాకీ ఉన్నారని వాసిరెడ్డి పద్మ మీడియాతో పదే పదే చెబుతున్నారు. తాను పదిహేనేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటికీ కనీసం ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వలేదని వాసిరెడ్డి పద్మ వాదన. అందుకే తనకు వైసీపీ లో ఎదుగుదల లేదని భావించి తాను పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చానని చెబుతున్నారు. జగన్ తనకు రాజకీయంగా అన్యాయం చేశారని వాసిరెడ్డి పద్మ అంటున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం కేబినెట్ హోదా ఇచ్చినా ఆమెకు అంతకు మించిన పదవి కావాలంటే ఎలా? అని వేచి ఉండాలి కదా? అని అంటున్నారు.
టీడీపీ, జనసేనల్లోకి నో ఎంట్రీ...
కాపు సామాజికవర్గానికి చెందిన వాసిరెడ్డి పద్మ తొలుత జనసేనలో చేరాలనుకున్నారు. అయితే అప్పటికే జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో చేరతారన్న ప్రచారంతో వాసిరెడ్డి పద్మ ఆ ఆలోచనను మానుకున్నారు. సామినేని జనసేనలో చేరడమే కాదు కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడయ్యారు. దీంతో ఆమె జనసేనలో చేరే ఛాన్స్ లేదు. అందువల్లనే ఆమె టీడీపీలో చేరేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేనిచిన్నిని కలిసి ఆయన ద్వారా పార్టీలో చేరాలని వాసిరెడ్డి భావించారు. మూడు సార్లు కేశినేని చిన్నితో వాసిరెడ్డి పద్మ సమావేశమయ్యారు. కేశినేని చిన్ని కూడా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో మాట్లాడివర్క్ అవుట్ కాలేదని తెలిసింది. మొత్తం మీద వాసిరెడ్డి పద్మ దాదాపు ఏడాదిన్నర కాలంగా రాజకీయంగా దూరంగానే ఉంటున్నారు. మరి ఏ పార్టీ కూడా దరిదాపుల్లో చేర్చుకోదేమోనన్న ఆందోళన ఆమెలో కనపడుతుంది.


Tags:    

Similar News