Vangaveeti Radha : వంగవీటి అందుకే అలా మాట్లాడారా? ఫిక్స్ అయినట్లు కనపడుతుందిగా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో సరైన అవకాశాలు లభించడం లేదని భావించి నేతలు అసంతృప్తికి గురవుతున్నట్లే కనిపిస్తుంది. వంగవీటి రంగా కుమారుడు రాధా పరిస్థితి చూస్తే ఇప్పుడు అలాగే కనిపిస్తుంది. ఇక జనసేన కూటమిలో ఉన్నంత వరకూ తనకు ప్రాధాన్యత దక్కదని వంగవీటి రాధాకు అర్థమయినట్లుంది. అందుకే ఆయన నోటి నుంచి ఆ మాటలు వచ్చినట్లు కనిపిస్తున్నాయి. యధాలాపంగా అన్న మాటలు కావవి. కావాలని రాధా మాట్లాడిన మాటలు ఇప్పుడు కూటమి పార్టీల్లో కలకలం రేపుతున్నాయి. పవన్ కల్యాణ్ అదే సామాజికవర్గానికి చెందిన నేత అయినప్పటికీ వంగవీటి రంగాకు ఉన్న ఇమేజ్, క్రేజ్ ఎన్ని దశాబ్దాలైనా ఆ సామాజికవర్గం నుంచి ఆయన ముద్రను ఎవరూ చెరపలేరు.
రంగా వారసుడిగా...
వంగవీటి రంగా వారసుడిగా వచ్చిన వంగవీటి రాధాకు కూటమి ప్రభుత్వంలో న్యాయం జరగలేదన్న బాధ అందరిలోనూ వ్యక్తమవుతుంది. రాధా రాజకీయంగా చాలా నష్టపోయారు. ఇప్పటికే దశాబ్ద కాలం నుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. ఆయన ఉన్న పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ వంగవీటి రాధాకు ఎందుకో రాజకీయ పదవి దక్కడం లేదు. వంగవీటి రంగా కుమారుడిగా బలమైన కాపు సామాజికవర్గం నేతగా వంగవీటి రాధాకు సాధారణంగా పదవి వెతుక్కుంటూ రావాల్సి ఉంది. కానీ వంగవీటి రాధా విషయంలో మాత్రం అలా జరగడం లేదు. అందుకు కారణం కులం కార్డు ఇప్పుడు డైవర్ట్ అయిపోయిందంటున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంట్రీతో వంగవీటి రాధాను పెద్దగా పట్టించుకోవడం లేదని ఆయన వర్గం నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే రాధా యూటర్న్ తీసుకున్నారని అంటున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలోనే...
వంగవీటి రాధా తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించి అక్కడ వైసీపీ నేతలు జక్కంపూడి రాజా, దాడి శెట్టి రాజాలను గెలిపించాలని కోరారంటే ఆయన పరోక్షంగా వైసీపీకి మద్దతిచ్చేనట్లే అనుకోవాలి. ప్రస్తుతం టీడీపీలో ఉన్న వంగవీటి రాధా నోటి నుంచి వైసీపీ నేతలను గెలిపించమని బహిరంగ సభల్లో పిలుపు నివ్వడం యాధృచ్ఛికంగా జరిగింది కాదు. టీడీపీకి ఝలక్ ఇవ్వడానికైనా ఆ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. లేకుంటే నిజంగానే రాధా మనసులో ఉన్న మాటను చెప్పి ఉండవచ్చు. రంగా విగ్రహావిష్కరణ సందర్భంగా ముఖ్య అతిధిగా హాజరైన రాధా వ్యాఖ్యలతో ఇప్పుడు కూటమి పార్టీలో కొంత డైలామా ఏర్పడింది. అందులోనూ కాపులు అధిక సంఖ్యలో ఉండే తూర్పు గోదావరి జిల్లాలో వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు నిజంగానే కలకలం రేపాయని చెప్పాలి. మరి టీడీపీ నాయకత్వం వంగవీటి రాధాను ఎలా సర్ది చెప్పగలుగుతుందన్నది చూడాలి.