Ys Jagan : మళ్లీ "మూడు"తోనే గెలుద్దామనా? జగన్ స్ట్రాటజీ ఏంటి?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మావిగాన్ అస్త్రం ఎంత మేరకు పనిచేస్తుందో తెలియదు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మావిగాన్ అస్త్రం ఎంత మేరకు పనిచేస్తుందో తెలియదు. ఒక వైపు రాజధాని అమరావతి పనులు ఊపందుకున్న సమయంలో మావిగాన్ ప్రతిపాదనను తెచ్చి దానిని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ కు రాజకీయంగా ఎంత మేరకు ఉపయోగపడుతుందన్నది వేరే విషయమైనప్పటికీ అసలు ఏమీ లేని చోట ఎంతో కొంత రాజకీయ లబ్ది చేకూరుతుంది కదా? అని మావిగన్ పై వైసీపీ నేతలు కూడా దానిని జోరుగా ప్రచారం చేస్తున్నారు. అందుకే అమరావతికి సమీపంలో తాడేపల్లిలో మావిగన్ ఫ్లెక్సీని ఆ పార్టీ నేతలు ఏర్పాటు చేశారు.
మూడు ప్రాంతాలను కలుపుతూ...
ఇటీవల మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ తక్కువ ఖర్చుతో మావిగన్ పేరిట రాజధానిని ఏర్పాటు చేయాలని జగన్ కూటమి ప్రభుత్వానికి సూచించారు. దీంతో మావిగన్ నినాదం ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. రాజధాని అమరావతికి రెండు లక్షల కోట్లు పెట్టడం వృధా అని జగన్ పదే పదే చెబుతున్నారు. అందులో పది శాతం ఖర్చు పెట్టినా చాలు అని, రాజధాని నిర్మాణం పూర్తవుతుందని జగన్ ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నేతలను కూడా ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్ సూచించినట్లు తెలిసింది. అయితే మావిగాన్ ను ఫ్యాన్ పార్టీ నేతలు వదలడం లేదు.
మూడు రాజధానుల ప్రతిపాదనతో...
మూడు రాజధానుల ప్రతిపాదనతో గుంటూరు, కృష్ణా, విజయవాడ ప్రాంతాల్లో పార్టీకి ఇబ్బందులు ఎదురయ్యాయి. దాని ఫలితాలు మొన్నటి ఎన్నికల్లో చవి చూశారు. ఈ నేపథ్యంలోనే మావిగాన్ ప్రతిపాదనను తెచ్చారంటున్నారు. మూడు ప్రాంతాల్లో కనీస సీట్లు సాధించుకోవడానికే మావిగాన్ ప్రతిపాదనను తెచ్చి అధికార పార్టీని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మావిగాన్ ప్రతిపాదన పట్ల కొంత ఆ ప్రాంతాల్లో సానుకూలత వ్యక్తం అవుతుండటంతో ఇక వైసీపీ నేతలు రానున్న కాలంలో మరింతగా దానిని ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరి చివరకు ఎన్నికల్లో ఏ మేరకు లబ్ది పొందుతారన్నది చూడాలి.