Andhra Pradesh : ఆది అసలు బాధ అదేనటగా? ఓపెన్ అయింది అందుకేనట

జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూటమిలోని ప్రధాన నేతలను ఉద్దేశించి చేసినవేనని అర్థమవుతుంది

Update: 2026-04-09 08:55 GMT

కడప జిల్లా రాజకీయాల్లో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూటమిలోని ప్రధాన నేతలను ఉద్దేశించి చేసినవేనని అర్థమవుతుంది. జమ్మలమడుగు ఒకప్పుడు వర్గపోరుకు కేంద్రం. ఇప్పుడు అదే నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తీరు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, సొంత నియోజకవర్గంలో ఆయన ఒంటరి పోరాటం చేస్తున్నారనే భావన ఈ మధ్య ఆయన మాటల్లో వ్యక్తమవుతోంది. అందుకే పనులు కాకుంటే తన పదవికి రాజీనామా చేస్తానని అంటున్నారు.సొంత నియోజకవర్గంలో పట్టు కోసం ఆరాటమే ఆదినారాయణరెడ్డిని ఈ వ్యాఖ్యలను చేసినట్లుందని అంటున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోఅదానీ గ్రూప్ చేపట్టిన పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ విషయంలో దక్కిన కాంట్రాక్టు పనుల్లో సబ్ కాంట్రాక్టులు ఇవ్వాలని గతంలోనూ ఆది అనుచరులు హల్ చల్ చేశారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు ఆ పనులు దక్కడంతో ఆదినారాయణరెడ్డి ఉడికిపోతున్నారని తెలిసింది. తన నియోజకవర్గంలో వారి పెత్తనమేంటన్న అభిప్రాయంతోనే ఆయన ఆగ్రహావేశానికి గురవుతున్నట్లు తెలిసింది. జమ్మలమడుగులో ఆదినారాయణరెడ్డికి ఉన్న అతిపెద్ద సమస్య నియోజకవర్గంలో ఆధిపత్యం.

కూటమి ఒప్పందంలో భాగంగా...
మరొక వైపు కూటమి ఒప్పందంలో భాగంగా ఇక్కడ టీడీపీకి చెందిన భూపేష్ రెడ్డి కూడా క్రియాశీలకంగా ఉన్నారు. ప్రభుత్వ పథకాలు, నామినేటెడ్ పదవులు లేదా స్థానిక పోలీసు వ్యవస్థపై పట్టు విషయంలో ఆదినారాయణరెడ్డి వర్గానికి, భూపేష్ రెడ్డి వర్గానికి మధ్య అంతర్గత పోరు నడుస్తోందంటున్నారు. తన కళ్ళ ముందే ప్రత్యర్థి వర్గానిది పైచేయి కావడం, ఎమ్మెల్యేగా ఉన్నా తన మాట నెగ్గకపోవడం ఆయన్ని తీవ్ర అసహనానికి గురిచేస్తోంది. భూపేష్ రెడ్డి ఎవరో కాదు ఆయన సోదరుడి కుమారుడు. తన రాజకీయ వారసుడిగా కూడా గతంలో ఆదినారాయణ రెడ్డి చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం రాజకీయం చేస్తున్నారు.
తన వర్గంపై కేసులు...
ఆది అనుచరులు అదానీ ఆఫీసుపై దాడి చేసినట్లు ఆరోపణలు రావడం, దానిపై కేసులు నమోదు కావడం ఆదినారాయణరెడ్డికి మింగుడుపడటం లేదు. నియోజకవర్గంలో జరుగుతున్న భారీ ప్రాజెక్టులలో తన ప్రమేయం లేదా తన అనుచరులకు లబ్ధి చేకూరకపోవడం కూడా ఆయన అసహనానికి ఒక కారణమని తెలుస్తోంది.రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా, కూటమి ప్రభుత్వంలో తన వర్గానికి సరైన ప్రాధాన్యత దక్కడం లేదని ఆయన భావిస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద తన కంటే భూపేష్ రెడ్డికే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోందనేది ఆయన ప్రధాన ఫిర్యాదు. ఈ క్రమంలోనే తన ఉనికిని చాటుకోవడానికి రాజీనామా అస్త్రాన్ని ఆయన తరచుగా వాడుతున్నట్లు కనిపిస్తోంది.


Tags:    

Similar News