TDP : వంగలపూడి అనిత వైసీపీకి టార్గెట్ అయ్యారా?
వైసీపీ నేతలకు హోంమంత్రి వంగలపూడి అనిత టార్గెట్ అయ్యారనిపిస్తుంది
వైసీపీ నేతలకు హోంమంత్రి వంగలపూడి అనిత టార్గెట్ అయ్యారనిపిస్తుంది. తరచూ వంగలపూడి అనిత జగన్ ను ఏకవచనంతో సంభోదించడంతో పాటు జగన్ ను పులివెందుల ఎమ్మెల్యేగా పదే పదే అనిత మాట్లాడుతుండటతో వైసీపీ నేతలు ఆమెను లక్ష్యంగా చేసుకున్నారన్న అభిప్రాయంలో టీడీపీ నాయకత్వం ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఏదో ఒక ఘటన జరుగుతుంది. హత్యలు, అత్యాచారాలు జరిగినప్పుడల్లా వైసీపీ నేతలు వెంటనే అక్కడకు వాలిపోయి శాంతిభద్రతల సమస్య అంటూ గళమెత్తుతున్నారు. కందుకూరులో వాహనంతో తొక్కించి చంపిన ఘటన కావచ్చు. తునిలో బాలికపై టీడీపీ నేత అత్యాచారానికి ప్రయత్నించిన ఘటన కావచ్చు. అనిత పైనే వైసీపీ నేతలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
పాయకరావుపేట నియోజకవర్గంలో...
ఇక వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలో బల్క్ డ్రగ్ పార్క్ పై కూడా వైసీపీ అక్కడి మత్స్యకారులకు అండగా నిలిచింది. అక్కడి మత్స్యకారులు తమ ప్రాంతంలో బల్క్ డ్రగ్ పార్క్ అవసరం లేదని ఆందోళన చేస్తున్నారు. అయితే జగన్ ఆదేశాల మేరకు వైసీపీ నేతలు నిన్న రాజయ్యపేట గ్రామానికి వెళ్లారు. అక్కడ బల్క్ డ్రగ్ పార్క్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న మత్స్యకారులకు మద్దతు ప్రకటించారు. జగన్ కూడా త్వరలోనే ఈ ప్రాంతంలో పర్యటిస్తారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అంటే నేరుగా హోంమంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావు పేట నియోజకవర్గంలో జగన్ పర్యటన మరింత హీట్ ను పెంచుతుందని భావిస్తున్నారు.
శాంతిభద్రతల సమస్యపై...
మరొకవైపు రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నా, తమ పార్టీ కార్యకర్తలపై నమోదవుతున్న అక్రమ కేసులతో పాటు, పలు అంశాలు వైసీపీ అధినేత జగన్ పై చేస్తున్న విమర్శలు హోంమంత్రి అనితను లక్ష్యంగా చేసుకున్నారని టీడీపీ నేతలు అంటున్నారు.అయితే వైసీపీ నేతలు మాత్రం తాము వంగలపూడి అనితను ఎందుకు లక్ష్యంగా చేసుకుంటామని, ఒక ఘటన జరిగినప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా స్పందిస్తామని, హోంమంత్రిగా ఎవరున్నా తమ రియాక్షన్ అలాగే ఉంటుందని, ఇందులో ప్రత్యేకించి ఒకరిని లక్ష్యంగా చేసుకునేది ఉండదని వైసీపీ నేతలు అంటున్నారు. మొత్తం మీద వైసీపీ వర్సెస్ వంగలపూడి అంటూ సోషల్ మీడియాలో టీడీపీ క్యాడర్ మాత్రం పెద్దయెత్తున కామెంట్స్ పెడుతుంది.