Andhra Pradesh : అరెస్ట్ లతో క్యాడర్ హ్యాపీ.. మరి మామూలు ఓటర్ల మాటేంటి?
ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఎన్నడూ ఈ పరిస్థితులు లేవు. కక్ష పూరిత రాజకీయాలు మొదలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఎన్నడూ ఈ పరిస్థితులు లేవు. కక్ష పూరిత రాజకీయాలు మొదలయ్యాయి. అంతకు ముందు ఇటువంటి కేసులు, అరెస్ట్ లు లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని, రాష్ట్రం విభజన జరిగిన తర్వాత కానీ కక్ష పూరిత చర్యలకు ఎవరూ దిగలేదు. 2014లో కొంత ప్రారంభమయిన ఈ కక్షలు 2024 నాటికి పీక్స్ కు చేరుకున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే వైసీపీ పార్టీ ఆవిర్భవించి జగన్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, టీడీపీలో లోకేశ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇటువంటి రాజకీయాలు చోటు చేసుకున్నాయని చెప్పక తప్పదు. చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి సుదీర్ఘకాలం రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో చేసినప్పటికీ ఇటువంటి కేసులు, అరెస్ట్ లు గతంలో ఎన్నడూ చూడలేదు.
నాడు టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తే...
వైఎస్ జగన్, లోకేశ్ లు ఇద్దరూ తమ పార్టీ కార్యకర్తల కళ్లల్లో సంతోషం చూడటం కోసం ఈ రకమైన వ్యవహార శైలిని అలవర్చుకున్నారనే చెప్పాలి. ఇద్దరూ చట్టప్రకారమే అరెస్ట్ లు చేస్తున్నామని చెబుతున్నా కార్యకర్తలు హ్యాపీగా ఉండవచ్చేమో కానీ, సామాన్య ప్రజలు మాత్రం ఈ కక్ష రాజకీయాలను చూసి విసిగిపోతున్నారు. 2019 లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు. చివరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కూడా స్కిల్ డెవలెప్ మెంట్ కేసులో అరెస్ట్ చేశారు. యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. అదే 2024 లో ఆయనకు సానుభూతి పెరిగి గతంలో టీడీపీకి రాని సీట్లు వచ్చాయి. అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ పదకొండు సీట్లకే పరిమితమయింది.
నేడు వైసీపీ నేతలు జైల్లోకి...
ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే జరుగుతుంది. పైగా ఓపెన్ గా రెడ్ బుక్ అంటూ లోకేశ్ చెబుతూ అరెస్ట్ లను చేయిస్తుండటంతో టీడీపీ క్యాడర్ ఖుషీ కావచ్చు. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకూ జరిగిన అరెస్ట్ కు ప్రతీకారంగా ఈ అరెస్ట్ లు అని వారు సంబరపడవచ్చు. కానీ రానున్న ఎన్నికల్లో మాత్రం సామాన్య ప్రజలు మాత్రం దీనిని హర్షించరన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. ఇప్పటికే పోలీసు అధికారు లనుంచి వైసీపీ నేతల వరకూ అరెస్టయ్యారు. మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇలా ఒక్కరేమిటి వరసగా గుంటూరు, విజయవాడ జైళ్లకు వెళ్లి వస్తున్నారు. అయితే అందరూ అరెస్ట్ లకు మానసికంగా సిద్ధమయ్యారు.
వరస కేసులతో...
ఈసారి అరెస్ట్ లు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఒకే కేసు కాదు.. ఒక కేసులో బెయిల్ వస్తే మరొక కేసులో అరెస్ట్ చేస్తున్నారు. ఈ పద్ధతిని ఇప్పుడు టీడీపీ ప్రవేశపెట్టినా వైసీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అదే మార్గాన్ని ఎంచుకుంటుంది. ఇప్పటికే జగన్ పలు మార్లు 2.O లో తడాఖా చూపుతామని వార్నింగ్ లుఇస్తున్నారు. జగన్ ను అరెస్ట్ చేసినా అది ఏ కేసులోనైనా సానుభూతి పుష్కలంగా లభించే అవకాశాలను కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు సయితం అంటున్నారు. ఇక ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా లోకేశ్, జగన్ జమానాలలో ఇలా కక్ష పూరిత రాజకీయాలు కొనసాగక తప్పవన్న కామెంట్స్ అయితే బలంగా వినిపిస్తున్నాయి. మరి ఎంత వరకూ ఇవి దారితీస్తుందన్నది చూడాల్సి ఉంది.