Pawan Kalyan : ఈ ఇద్దరు మౌనంగా ఉండటానికి అసలు రీజన్ అదేనా?
జనసేనలో ఉన్న ఇద్దరు సీనియర్ నేతలు మౌనంగా ఉండటంపై పార్టీలో చర్చ జరుగుతుంది
జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇద్దరు ఎంపీలున్నారు. కానీ ఇందులో నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ మినహాయించిఎవరూ పెద్దగా యాక్టివ్ గా లేరు. కూటమి ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు గాని, విపక్షాలు చేస్తున్న ప్రచారంపై కానీ వీరు ఎవరూ స్పందించడం లేదు. మంగళగిరి లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చినప్పటికీ పవన్ కల్యాణ్ తో సమావేశమై వెళ్లిపోతున్నారు. అంతే తప్ప తమ నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి పనుల గురించి కూడా వారు వివరించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఏదైనా ఉంటే నాదెండ్లమనోహర్, కందుల దుర్గేశ్ మాత్రమే రెస్పాండ్ అవుతున్నారు.
సీనియర్ నేతగా...
పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నా లేనట్లే కనిపిస్తున్నారు. జనసేనకు చెందిన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలల్లో సీనియర్ నేతలు కూడా ఉన్నారు. మండలి బుద్ధప్రసాద్ అందులో ఒకరు. 2024 ఎన్నికలకు ముందు చివరి క్షణంలో పార్టీలో చేరి జనసేన టిక్కెట్ ను మండలి బుద్దప్రసాద్ తెచ్చుకోగలిగారు. అవనిగడ్డ జనసేనలో కొంత అప్పట్లో వ్యతిరేకత వ్యక్తమయినా పెద్దమనిషి కావడం, వివాదాలకు దూరంగా ఉండే మండలి బుద్ధ ప్రసాద్ ను అభ్యర్థిగా ఎంపిక చేశారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వ హయాంలో పనిచేయడమే కాకుండా రాజకీయంగా అనుభవమున్న నేతగా ఆయన గుర్తింపు పొందారు. మిగిలిన వారు కొత్తగా ఎంపికయినా మండలి బుద్ధ ప్రసాద్ లాంటి వాళ్లు మౌనంగా ఎందుకుంటున్నారన్నది జనసైనికులను వేధిస్తున్న ప్రశ్న.
మాజీ మంత్రిగా...
ఇక మరో సీనియర్ నేత అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ. ఈయన కూడా సీనియర్ నేత. మాజీ మంత్రిగా కాంగ్రెస్ లో పనిచేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న కొణతాల రామకృష్ణ తర్వాత వైసీపీలో చేరడం తర్వాత జగన్ తో విభేదాలు తలెత్తి బయటకు రావడం జరిగింది. దాదాపు కొన్నేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న కొణతాల రామకృష్ణకు అన్ని సబ్జెక్టులపై అవగాహన ఉంది. 2024 ఎన్నికలకు ముందు ఆయన జనసేనలో చేరారు. ఆ టిక్కెట్ ను నాగబాబుకు అనుకున్నా చివరి నిమిషంలో పవన్ కల్యాణ్ కొణతాలకు కేటాయించారు. గెలిచినా కొణతాలకు సీనియర్ కోటాలో మాత్రం మంత్రి పదవి దక్కలేదు.
ఇద్దరూ మౌనంగానే...
అయితే ఇప్పుడు మండలి బుద్ధప్రసాద్, కొణతాల రామకృష్ణ ఇద్దరూ మౌనంగా ఉండటమే పార్టీలో చర్చనీయాంశమైంది. అసలు వీళ్లిద్దరికీ ఏమైందన్న అభిప్రాయం జనసైనికుల్లో కలుగుతుంది. సీనియర్ నేతలు, అనుభవమున్న లీడర్లు అయినా పవన్ కల్యాణ్ కు అన్ని విషయాల్లో చేదోడు, వాదోడుగా ఉండాల్సిన సమయంలో ఎందుకు దూరం పాటిస్తున్నారన్నది ఎవరికీ అర్థం కాకుండా ఉంది. రాష్ట్ర స్థాయి నేతలు వారి నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. వారంతట వారే దూరమయ్యారా? లేక పవన్ కల్యాణ్ దూరం పెట్టారా? అన్న చర్చ కూడా పార్టీలో జరుగుతుంది. సబ్జెక్ట్ లపై కమాండ్ ఉన్న ఇద్దరు నేతలు కామ్ గా ఉండటం పార్టీకి మంచిది కాదని పలువురు జనసేన నాయకులే సూచిస్తున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఏంటన్నది వారే చెప్పాల్సి ఉంది.