AP Liquor Scam : లిక్కర్ స్కామ్ లో ఇక అరెస్ట్ లీడర్ల వంతు వచ్చేసినట్లేనా?

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో ఇక అరెస్ట్ లన్నీ రాజకీయ నేతలవి ఉండబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి

Update: 2025-07-19 04:39 GMT

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో ఇక అరెస్ట్ లన్నీ రాజకీయ నేతలవి ఉండబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హాయాంలో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించడం, డిజిటల్ పేమెంట్స్ కు అంగీకరించకపోవడంతో పెద్దయెత్తున అవినీతి జరిగిందని కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత స్పెషల్ ఇన్విస్టేగేషన్ టీం ఏర్పాటు చేసింది. సిట్ ఏర్పాటయిన తర్వాత ఈ మద్యం స్కాం కేసులో ప్రమేయం ఉందని భావించిన నిందితులను వరసగా అరెస్ట్ చేస్తూ వెళుతుంది. ఇప్పటి వరకూ ఛార్జిషీట్ దాఖలు చేయకపోయినా పదకొండు మందిని ఈ కేసులో అరెస్ట్ చేసింది. ఈ కేసులో అరెస్టయిన తొమ్మిది మందిలో ఇద్దరు మాత్రమే రాజకీయ నేతలు. మిగిలిన వారంతా మాజీ అధికారులు.. రాజ్ కేసిరెడ్డి లాంటి వాళ్లే.

మిధున్ రెడ్డిని నేడు...
అయితే ఛార్జిషీట్ వేసే సమయంలో మరొక కీలక పరిణామం నేడు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. వైసీపీ పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డి నేడు విజయవాడకు రానున్నారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో స్పెషల్ ఇన్విస్టిగేషన్ అధికారుల ఎదుట హాజరు కానున్నారు. హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ మిధున్ రెడ్డి వేసిన ముందస్తు బెయిల్ తిరస్కరణకు గురి కావడంతో ఆయన సిట్ ఎదుట హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు. నేడు సిట్ అధికారులు మిధున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశముందని తెలిసింది. ఆయనకు ఇప్పటికే సిట్ అధికారులు ఈరోజు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. మిధున్ రెడ్డి కూడా విచారణకు నేడు హాజరవుతానని తెలిపారు. అయితే విచారణ తర్వాత అరెస్ట్ చేసే అవకాశముందని చెబుతున్నారు.
నారాయణస్వామికి కూడా...
మరొకవైపు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మరొక కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణస్వామికి కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేసే సమయంలో నారాయణస్వామిని ఈ నెల 21వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఉదయం పది గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో సిట్ అదికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకూ 49 మందిని నిందితులుగా చేర్చారు. ఇందులో పదకొండు మందిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపారు. ఈరోజు ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశముండటంతో ఎవరి పేర్లు అందులో ఉన్నాయన్న టెన్షన్ నెలకొంది.


Tags:    

Similar News