TDP : గోడు వినేవారేరీ.. గొప్పలు చెప్పుకుంటే.. గెలుపు దక్కుతుందా?

చంద్రబాబు నాయుడు పాలనలో కొన్ని లోపాలు జగన్ తనకు అనుకూలంగా మలచుకునే అవకాశాలున్నాయి

Update: 2026-01-25 06:34 GMT

చంద్రబాబు నాయుడు పాలనలో కొన్ని లోపాలు జగన్ తనకు అనుకూలంగా మలచుకునే అవకాశాలున్నాయి. కానీ టీడీపీ నాయకత్వం లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. ఎమ్మెల్యేల అవినీతి ఆరోపణలతో పాటు పార్టీ కార్యకర్తలను పట్టించుకోకపోవడం కూడా ఈసారి టీడీపీకి అననుకూలత అని చెప్పాలి. చంద్రబాబు నాయుడు ప్రతి నియోజకవర్గంలో పర్యటనకు వెళ్లినప్పటికీ అక్కడ టీడీపీ నేతలతో సమావేశం అవుతున్నా.. తాను చెప్పదలచుకున్నది చెప్పి వచ్చేస్తున్నారు. అంతే తప్ప వారి బాధలను, కష్టాలను కూడా స్వయంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. తాను చెప్పదలచుకున్న విషయాన్ని మాత్రం చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు.

తీరిక సమయం....
ఇక నారా లోకేశ్ కూడా క్యాడర్ ను పట్టించుకునే తీరిక.. సమయం ఆయనకు లేదు. కార్యకర్తలకు భరోసా ఉంటానని చెప్పిన లోకేశ్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. కనీసం టీడీపీ సోషల్ మీడియాలో కనిపించే నెగిటివ్ ఒపీనియన్ లను కూడా లోకేశ్ కు టీం చేర వేసే ప్రయత్నం చేయడం లేదు. దీంతో ఆల్ ఈజ్ వెల్ అన్న ఫీలింగ్ లో ఉన్నారు. కూటమిలోని మూడు పార్టీలు కలసి ఉంటే జగన్ ను సులువుగా ఓడించగలమన్న ధైర్యం మాత్రమే తండ్రీకొడుకుల్లో కనపడుతుంది తప్ప.. క్యాడర్ కష్టాలను పట్టించుకోవాలన్న ధ్యాస మాత్రం ఇసుమంతైనా పెట్టడం లేదు. అదేమంటే రాష్ట్రాభివృద్ధి కోసం అంటూ రాగాలు తీస్తున్నారు.
గుంభనంగా క్యాడర్...
దీంతో స్థానిక శాసనసభ్యులు కనీసం టీడీపీ శ్రేణులకు కూడా అందుబాటులో ఉండటం లేదు. స్థానిక నాయకత్వం వారి నుంచి ఏమి ఆశిస్తున్నారో తెలుసుకోవలసిన బాధ్యతను వారిద్దరిలో ఎవరో ఒకరు తీసుకోకపోతే పార్టీకి నష్టం వాటిల్లుతుంది. జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఫిక్స్‌డ్ ఓటు బ్యాంక్‌ను కదిలించటం చాలా కష్టం. టీడీపీకి ఉన్న ఓటు బ్యాంక్‌ను కాపాడుకోవాలి, తటస్థ ఓటర్లను మెప్పించాలి. ప్రస్తుతం ఉన్న తీరులో టీడీపీ శ్రేణులే స్తబ్దుగా ఉన్నారు. చంద్రబాబు, లోకేశ్ లుపాలనలోనే మునిగిపోవటం టీడీపీకి నష్టం చేస్తుందేమో అన్న ఆందోళన టీడీపీని అభిమానించే వారిలో ఉన్నారు. ఏ ఏ వర్గాలు కూటమి ప్రభుత్వం పాలనపై అసంతృప్తిగా ఉన్నారన్న ప్రయత్నం చేయకపోగా.. సూపర్ సిక్స్ అమలు చేశామంటూ గొప్పలు చెప్పుకోవడం వల్ల నష్టం తప్ప లాభం ఏమీ ఉండదన్నది ఇప్పటికైనా పసుపు పార్టీ నాయకత్వం గుర్తించ గలిగితే కొంత నష్టనివారణ చేపట్టవచ్చు.


Tags:    

Similar News