TDP : చింతమనేని అన్న దాంట్లో తప్పేముంది? అన్నీ వాస్తవాలేగా?

తెలుగుదేశం పార్టీ లో కోవర్టులు పార్టీలో ఉన్న అసలైన నేతలను ఇబ్బందులు పెడుతున్నారు.

Update: 2026-01-24 06:58 GMT

తెలుగుదేశం పార్టీ లో కోవర్టులు పార్టీలో ఉన్న అసలైన నేతలను ఇబ్బందులు పెడుతున్నారు. ఈ విషయం ఎవరో చెప్పింది కాదు. సాక్షాత్తూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. టీడీపీలో అనేక మంది కోవర్టులున్నారంటూ చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారితో తాము ఇబ్బందులు పాలవుతున్నామని అన్నారు. కోవర్టుల వల్ల టీడీపీలో దీర్ఘకాలం నుంచి ఉన్న కార్యకర్తలు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండాను వదలకుండా పట్టుకుని, అనేక కేసులను ఎదుర్కొన్న వారు నేడు కోవర్టుల దెబ్బకు ఇబ్బందులు పడుతున్నారు. ఇది చింతమనేని ప్రభాకర్ ఒక్కరి అభిప్రాయమే కాదు. టీడీపీలో సుదీర్ఘంగా ఉన్న వారి నుంచి ఇదే రకమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కూటమిలో ఉన్న పార్టీలు...
కూటమిగా ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేనలున్నాయి. అయితే ఇందులో వైసీపీ నేతలు కొందరు గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమిలోని ఏదో ఒక పార్టీలో చేరిపోతున్నారు. ప్రధానంగా టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి అవసరాన్ని గుర్తించిన పార్టీ నాయకత్వం కొందరిని చేర్చుకుంటుంది. మరికొందరికి నో చెబుతుంది. టీడీపీలోకి నో ఎంట్రీ చెప్పడంతో నేతలు బీజేపీ, జనసేనలను ఆశ్రయిస్తున్నారు. కూటమిలోని మిత్ర పక్షాలు కావడంతో వారి విషయంలో ప్రభుత్వం కూడా ఏమీ చేయలేకపోతుంది. దీంతో గత ప్రభుత్వంలో తమను ఇబ్బందులు పెట్టిన వారు ఈ ప్రభుత్వంలోనూ ఏదో ఒక పార్టీలో దూరి తమను తాము కాపాడుకోవడమే కాకుండా అసలైన టీడీపీ నేతలను కూడా ఇబ్బందులు పెడుతున్నారు.
కేసులతో వేధించిన నేతలు...
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్న మాటల్లో వాస్తవాలు లేకపోలేదు. గత ప్రభుత్వ హయాంలో తమను కేసులతో వేధించిన నేతలు ఇప్పుడు కూడా ఆధిపత్యం చెలాయించడంపై చింతమనేని మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వంలోనూ తాము ఆనందంగా లేమని ఆయన పరోక్షంగా చెప్పుకొచ్చారు. తమను బాధపెట్టిన నేతలను ఏమీ చేయకుండా వదిలేయడమే కాకుండా, వారిని పార్టీలో చేర్చుకోవడాన్ని కూడా చింతమనేని ప్రభాకర్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అందుకే అసలైన కార్యకర్తలు ఇబ్బందులు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఆ విషయాన్ని మాత్రమే చింతమనేని ప్రభాకర్ వెల్లడించారు. పార్టీ నాయకత్వం కూడా చేరికల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేకుంటే టీడీపీ అసలైన కార్యకర్తలు జెండాను మూలన పెట్టడం ఖాయమన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News