Ys Jagan : పాదయాత్ర అసలు ప్లాన్ అదేనా? వ్యూహం వర్కవుట్ అవుతుందా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు కేంద్రంలో పట్టు సడలలేదు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు కేంద్రంలో పట్టు సడలలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా జగన్ పై ఉన్న కేసులు రవ్వంత కూడా కదలడం లేదు. అందులో టీడీపీ కేంద్రంలో ప్రధాన భాగస్వామిగా ఉంది. టీడీపీ వల్లనే కేంద్రంలో బీజేపీ మనుగడ కొనసాగుతుంది. అయినా సరే కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తేవడంలో మాత్రం చంద్రబాబు విఫలమవుతున్నారు. జగన్ అది అడ్వాంటేజీగా తీసుకున్నారు. రెండేళ్లు గడిచిపోతుంది. మరో ఏడాదిన్నరలో జగన్ పాదయాత్రను ప్రారంభించబోతున్నారు. పాదయాత్ర మొదలయితే ఇక కేసుల్లో కదలిక ఉండటం కష్టమేనని అందరికీ తెలుసు. పాదయాత్ర సమయంలో కేసులను కదిలించి లేనిపోని సానుభూతిని కూటమి కొని తెచ్చుకోలేదు.
అదే జగన్ ధీమా...
అందుకే జగన్ ధీమాగా ఉన్నట్లు కనపడుతుంది. మరొకవైపు పాదయాత్ర ఈసారి సుదీర్ఘంగా కొనసాగించాలని జగన్ నిర్ణయించుకున్నారు. దాదాపు ఏడాదిన్నరకు పైగానే ఆయన జనంలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. జగన్ పాదయాత్రకు ఏదైనా అడ్డంకులు కల్పించినా, నిబంధనల పేరుతో అడ్డు చెప్పినా గత యువగళం పాదయాత్ర తరహాలో మరొకసారి ఏపీలో జగన్ కు అనుకూలంగా సెంటిమెంట్ రాసుకుంటుంది. అందుకే జగన్ పాదయాత్రకు దిగారు. తన పాదయాత్రకు ఏ మాత్రం అడ్డంకి సృష్టించినప్పటికీ అది తనకు, తన పార్టీకి అనుకూలంగా మారుతుందని జగన్ అంచనా వేస్తున్నారు. సానుభూతి కోసం జగన్ ఖచ్చితంగా ప్రయత్నించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.
పాదయాత్ర మొదలయితే...
మరొకవైపు ఇప్పటికే క్యాడర్, లీడర్లు బయటకు వస్తున్నారు. ఇక పాదయాత్ర మొదలయితే మరింత ఉధృతి మొదలవుతుంది. అప్పుడు కేసుల పేరుతో ఏం చేసినా అది జగన్ కు అడ్వాంటేజీగా మారుతుందన్న అంచనాలున్నాయి. జగన్ కూడా అదే కోరుకుంటున్నాడు. తనపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి జైల్లో పెడితే చంద్రబాబు తరహాలో సానుభూతి వర్క్ అవుట్ అవుతుందని ఆశిస్తున్నారు. కానీ జగన్ స్ట్రాటజీ తెలిసిన చంద్రబాబు రాష్ట్రం నుంచి కాకుండా తమ చేతులకు మట్టి అంటకుండా కేంద్ర దర్యాప్తు సంస్థల చేత అరెస్ట్ చేయించాలన్న ఆలోచన చేసినా కూటమిలో బీజేపీ కూడా భాగస్వామి కాబట్టి అది కూడా జగన్ కు సానుకూలమైన అంశమే. అందుకే జగన్ ఈ వ్యూహానికి తెరతీశారు. చంద్రబాబు మాత్రం జగన్ కేసుల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తీసుకు రావడంలో విఫలమయ్యారన్న ముద్ర ఇప్పటికే టీడీపీ క్యాడర్ లో పడింది. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.