Chandrababu : టీడీపీని ముంచేసేది ఆ బృందమేనా? బాబు బయటపడలేకపోతున్నారా?
తెలుగుదేశం పార్టీ ఏ మాత్రం మారలేదు. అధికారుల ఫీడ్ బ్యాక్ తోనే అంతా ఓకే అన్నట్లు భ్రమల్లో ఉంది
తెలుగుదేశం పార్టీ ఏ మాత్రం మారలేదు. అధికారుల ఫీడ్ బ్యాక్ తోనే అంతా ఓకే అన్నట్లు భ్రమల్లో ఉంది. గతంలో జగన్ కూడా తాడేపల్లిలోని ఇంట్లో కూర్చుని సీఎంవో ఇచ్చిన ఫీడ్ బ్యాక్ తో సిద్ధం అని చివరకు సభలు పెట్టి ఓటమికి పార్టీని సిద్ధం చేశారు. జగన్ కు అధికారంలో ఉన్ననాళ్లు క్యాడర్ కనిపించలేదు. అదే సమయంలో కనీసం ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుందామన్న స్పృహ కూడా లేదు. అదే జగన్ ఓటమికి ప్రధాన కారణాలు. అనేక నిర్ణయాలు.. ఆహా.. ఓహో అంటూ కార్యాలయంలో ఐఏఎస్ ల చప్పట్ల మధ్య ప్రజల వ్యతిరేకత జగన్ చెవికి సోకలేదు. క్షేత్ర స్థాయిలో నాటి వైసీపీపై వ్యతిరేకత 2021లో మొదలయినా 2024 ఎన్నికల ఫలితాల వరకూ జగన్ కు కనిపించకుండా చేయడంలో చుట్టూ ఉన్నవారు సక్సెస్ అయ్యారు.
ఐఏఎస్ లపైనే మళ్లీ...
ఇప్పుడు చంద్రబాబునాయుడు కూడా అదే పరిస్థితి. ఐఏఎస్ ల మీదనే ఆధారపడి ఉన్నారు. ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలను అస్సలు పట్టించుకోవడం లేదు. సంక్షేమం..అభివృద్ధి అద్భుతం అంటూ ఆయన చెవికి చేరుతుండటంతో ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ మురిసిపోతున్నారు. క్యారెక్టర్లు మారాయి కానీ.. అవే చిడతలు.. అదే భజనలు. జగన్ ఇక అధికారంలోకి రారన్న భ్రమను చంద్రబాబు చెవిలో జోరీగల్లా చేరి వినిపిస్తుండటంతో ఆయనకు అది రామమంత్రంగా వినిపిస్తుంది. ఇప్పుడు కూడా చంద్రబాబు తీసుకునే నిర్ణయాల్లో 80 శాతం వాటిపై వ్యతిరేకత కనిపిస్తుంది. ఒక ఇరవై శాతం మంచి నిర్ణయాలుండవచ్చు. ఆ ఇరవై శాతాన్ని హైలెట్ చేసి చంద్రబాబు వద్ద కొందరు చూపించి లబ్ది పొందుతున్నారు.
వ్యతిరేకత లేదనుకుంటే ఎలా?
అమరావతి రెండో విడత భూ సమీకరణ, కొత్త ఎయిర్ పోర్ట్, కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమను నిర్లక్ష్యంచేయటం, రైతుల బాధలను పట్టించుకోకపోవడం వంటివి కూటమి ప్రభుత్వానికి ప్రతికూలలతలే. పోలవరం ప్రాజెక్టును పట్టించుకోవడం లేదు. రాజధాని అమరావతి కోసం లక్షల కోట్లు ఖర్చు పెడుతుండటం మిగిలిన ప్రాంతాలపై ఖచ్చితంగా ప్రభావం చూపుతున్నాయంటున్నారు. అలాగని రాజధాని పరిసర ప్రాంతంలోనైన కృష్ణా, గుంటూరు జిల్లాలో కూడా సానుకూలత లేదన్నది ఆయనకు ఆలస్యంగా అర్థమవుతుందని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. మీడియా ఎంత ప్రశంసించినా, సోషల్ మీడియాలో హోరెత్తి భజన చేయించుకున్న ప్రజలలో వ్యతిరేకతను ఎవరూ ఆపలేరు. ఖచ్చితంగా అవి నష్టం చేకూరుస్తాయి. విజన్ అంటే ప్రజలు వింటారనుకుంటే .. 1999 నుంచి అనేక సార్లు టీడీపీ ఓటమి పాలయిన విషయాన్ని టీడీపీ సానుభూతిపరులే గుర్తు చేస్తున్నారు. ఎవరికైనా క్షవరం అయితే కానీ వివరం తెలియదన్నట్లు .. తీరా ఓటమి అంచున ఉన్నప్పుడు ఏం చేసినా ఫలితం లేదన్నది క్యాడర్ నుంచి వినిపిస్తున్న మాట. ఈ భజన బృందం నుంచి బాబు బయటపడాలని పార్టీ క్యాడర్ బలంగా కోరుకుంటుంది.