‍‍Nara Lokesh : నేటితో యువగళం పాదయాత్ర ముగింపు... 3,132 కిలోమీటర్ల దూరం ప్రయాణం

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటితో ముగియనుంది. విశాఖకు చేరుకున్న యాత్ర నేడు పరిసమాప్తం కానుంది.

Update: 2023-12-18 02:56 GMT

yuvagalam

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటితో ముగియనుంది. విశాఖకు చేరుకున్న యాత్ర నేడు పరిసమాప్తం కానుంది. ఎల్లుండి బహిరంగ సభతో యాత్రను పూర్తిగా లోకేష్ ముగించనున్నారు. ఈ ఏడాది జనవరి 27వ తేదీన నారా లోకేష్ యువగళం పాదయాత్ర కుప్పం నియోజకవర్గంలో ప్రారంభమయింది. ఎండనక. వాననక లోకేష్ అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ క్యాడర్ లో ఉత్తేజం నింపారు. అనేక మందితో సమావేశమవుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుని వారికి భరోసా ఇచ్చారు.

సీమలో ప్రారంభమై...
నారా లోకేష్ మొత్తం 3,132 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశారు. లోకేష్ పాదయాత్ర రాయలసీమలో ప్రారంభమై ఉత్తరాంధ్రలో ముగిసింది. మధ్యలో రెండు నెలల పాటు చంద్రబాబును అరెస్ట్ చేయడంతో పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. అయితే ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ఇచ్ఛాపురం వరకూ సాగాల్సిన పాదయాత్రను విశాఖలోనే ఆయన ముగించాలని నిర్ణయించుకున్నారు. 11 ఉమ్మడి జిల్లాల పరిధిలో 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పాదయాత్ర సాగింది.
సమస్యలు వింటూ...
లోకేష్ ఇప్పటి వరకూ డెబ్భయి బహిరంగ సభలు, 155 ముఖాముఖి సమావేశాలను నిర్వహించారు. పన్నెండు ప్రత్యేక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. రచ్చబండ కార్యక్రమాలు ఎనిమిది నిర్వహిచంారు. లోకేష్ పాదయాత్రలో ఇప్పటి వరకూ 4,353 వినతి పత్రాలు అందినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వివిధ కులాలు, వృత్తుల వారితో సమావేశమై వారి సమస్యలను ఓపిగ్గా విన్న నారా లోకేష్ తాము అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనేక మందితో మమేకమై సాగిన ఈ పాదయాత్రలో ప్రతి వంద కిలోమీటర్లకు శిలాఫలకాన్ని ఆవిష్కరించనున్నారు. నేటితో విశాఖ జిల్లా అంగనపూడి వద్ద తన పాదయాత్రను ముగించనున్నారు.


Tags:    

Similar News