TDP : టీడీపీకి వారి నుంచే అసలు ముప్పు.. అర్ధమవుతుందా.. రాజా?

తెలుగుదేశం పార్టీకి అంతకు ముందు లేని సమస్య ఇప్పుడు రావడానికి ప్రధాన కారణం ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలేనన్న విశ్లేషణలు వినపడుతున్నాయి

Update: 2025-11-11 07:18 GMT

తెలుగుదేశం పార్టీకి అంతకు ముందు లేని సమస్య ఇప్పుడు రావడానికి ప్రధాన కారణం ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలేనన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. గత ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఇతర పార్టీలకు చెందిన నేతలకు టిక్కెట్లను ఇచ్చి తెలుగుదేశం పార్టీ నాయకత్వం బరిలోకి దింపింది. ముఖ్యంగా వైసీపీ నుంచి వచ్చిన నేతలు ఎక్కువ మందికి టిక్కెట్లు ఇచ్చిన వారిలో ఉన్నారు. అయితే వారికి, కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న వారికి మధ్య గ్యాప్ పెరిగింది. ఇతర పార్టీల నుంచి వచ్చి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు స్థానిక టీడీపీ నేతలను దగ్గరకు తీసుకోవడం లేదు. తమకు తాము ప్రత్యేకంగా ఒక టీం ను ఏర్పాటు చేసుకుని ముందుకు వెళుతున్నారు. అంటే పాత టీడీపీ నేతలపై వారికి నమ్మకం లేకనే ఈ మధ్య అనేక వివాదాలకు కారణమయింది.

తంబళ్ల పల్లి నుంచి కావలి వరకూ...
తంబళ్లపల్లి నకిలీ మద్యంకేసు దగ్గర నుంచి కావలి నియోజకవర్గం రగడ వరకూ అదే సమస్య. ఎందుకు ఇతర పార్టీల నేతలను పార్టీలోకి చేర్చుకోవాలి? నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న టీడీపీకి పోటీ చేసే నేతలు లేరా? అన్న ప్రశ్న తెలుగు తమ్ముళ్లలో వ్యక్తమవుతుంది. కేవలం ఆర్థికంగానూ, సామాజికపరంగానూ లెక్కలు వేసుకుని ఇతర పార్టీల నేతలకు గాలం వేసి మరీ పార్టీ కండువాలు కప్పేసి వారికే బీఫారాలు ఇస్తే ఇక తాము దశాబ్దాలుగా పడిన కష్టాలకు ప్రతిఫలిం ఏముంటుందని కొందరు నేతలు ఆఫ్ ది రికార్డుగా ప్రశ్నిస్తున్నారు. గెలిచిన తర్వాత తమను చులకన చేసి చూడటం, తమను వేగులుగా భావించి దగ్గరకు రానివ్వకపోవడం వంటి వాటిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని నెల్లూరు జిల్లాకు చెందిన కొందరు టీడీపీ నేతలు నేరుగా నారా లోకేశ్ కు ఫిర్యాదు చేశారు.
గ్యాప్ పెరగడంతో...
కావలి టీడీపీ నేత సుబ్బనాయుడు మృతి తర్వాత జరిగిన ఘటనలు చూస్తే ఇదే అర్థమవుతుంది. సుబ్బనాయుడు మృతి పట్ల నెల్లూరు జిల్లాలోని నేతలు సీరియస్ గా స్పందించాల్సిన సమయంలో వారు మౌనంగా ఉండటంతో పాటు ఆయన అంత్యక్రియలకు పార్లమెంటు సభ్యుడు, చాలా మంది ఎమ్మెల్యేలు డుమ్మాకొట్టడం కూడా పార్టీ పరిస్థితికి అద్దం పడుతుంది. అయితే ఇటీవల కావలి నియోజకవర్గంలో పర్యటించిన లోకేశ్ దగదర్తి వెళ్లి సుబ్బనాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. కావలి టీడీపీలో తలెత్తిన విభేదాలను పరిష్కరించాలని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి బాధ్యతను అప్పగించారు. అయితే వేమిరెడ్డికి, కావ్య కృష్ణారెడ్డికి కూడా పొసగదని అంటున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరులోని అనేక నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల డామినేషన్ పెరిగిపోవడంతో టీడీపీ ఒరిజనల్ నేతలు ఇబ్బందులు పడుతున్నారు. మరి దీనికి పార్టీ నాయకత్వం ఏ రకమైన పరిష్కారం చూపుతుందన్నది చూడాలి.


Tags:    

Similar News