జగన్ విధ్వంసానికి దిగితే మాట్లాడరా?
ముఖ్యమంత్రి జగన్ తనకు లేని అధికారాన్ని చేతిలోకి తీసుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు
ముఖ్యమంత్రి జగన్ తనకు లేని అధికారాన్ని చేతిలోకి తీసుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. చట్టాన్ని గౌరవిస్తామని అందరం ప్రమాణం చేస్తామని, కానీ దానికి భిన్నంగా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. జగన్ విధ్వంసానికి దిగితే కోర్టులు, ప్రజలు, మేధావులు కూడా కరెక్ట్ చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఎంపిక చేసినట్లు కేంద్ర ప్రభుత్వం నిన్న సుప్రీంకోర్టులో అఫడవిట్ దాఖలు చేసిన విషయాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అమరావతిని పూర్తి చేసి ఉంటే...
అమరావతిని పూర్తి చేసి ఉంటే లక్షల కోట్ల ప్రయోజనం చేకూరి ఉండేదన్నారు. కానీ ఈ నాలుగేళ్లలో అమరావతిని నాశనం చేశారన్నారు. వెయ్యి రోజుల నుంచి రాజధాని రైతులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. చట్టప్రకారం అమరావతిలో అన్నీ పూర్తి చేయాల్సి ఉన్నా జగన్ కావాలని పక్కన పెట్టారన్నారు. రాజధాని అమరావతి ఎంపిక రహస్యంగా ఏమీ జరగలేదన్నారు. ప్రధాని మోదీ కూడా రాజధాని శంకుస్థాపనకు వచ్చని విషయాన్ని గుర్తు చేశారు. కౌన్సిల్ ను రద్దు చేస్తున్నట్లు బిల్లు పెట్టి తర్వాత దాని గురించి మాట్లాడటం లేదన్నారు. అమరావతిపై కులం పేరుతో విషం చిమ్మారన్నారు. ఎన్ని కుట్రలు చేసినా రాజధానిగా అమరావతిని మార్చడం ఎవరి వల్లా కాదని చంద్రబాబు అన్నారు.