Tirumala : తిరుమలకు వచ్చే భక్తులకు హై అలెర్ట్.. అలిపిరి టోల్ గేట్ నుంచే?

తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది

Update: 2025-12-27 03:25 GMT

తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. లాంగ్ వీకెండ్ కారణంగా శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. గత మూడు రోజుల నుంచి భక్తుల రద్దీ తిరుమలలో ఎక్కువగా ఉంది. కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. ఎన్నడూ లేని విధంగా అలిపిరి టోల్ గేట్ వద్దనే వాహనాల తనిఖీకి గంటల సమయం పడుతుంది. తిరుమల కొండపై వాహనాల పార్కింగ్ కూడా ఇబ్బందికరంగా మారింది. రోజులకు డెబ్భయి నుంచి ఎనభై వేల మందికిపైగానే తిరుమలకు భక్తులు తరలి వస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

వరస సెలవులు రావడంతో...
తిరుమలలో భక్తుల రద్దీ నెలకొన్నప్పటికీ వైకుంఠ ఏకాదశికి భారీగా ఏర్పాట్లు టీటీడీ చేస్తుంది. ఈ నెల 30వ తేదీన ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయాన్ని టీటీడీ ప్రత్యేకంగా అలంకరిస్తోంది. ఏకాదశి నుంచి పది రోజులు వైకుంఠ ద్వారం నుంచి వేంకటేశ్వర స్వామిని భక్తులు దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. వరస సెలవులు రావడంతో పాటు నూతన సంవత్సరం శ్రీవారిని దర్శించుకుంటే మంచిదని భావించి ఎక్కువ మంది భక్తుల తిరుమలకు చేరుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
శిలాతోరణం వరకూ...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లు అన్ని భక్తులతో నిండిపోయాయి. నారాయణగిరి షెడ్లు కూడా భక్తులతో నిండిపోయింది. శిలాతోరణం వరకూ క్యూ లైన్ లో భక్తులు బారులు తీరారు. సర్వ దర్శనం క్యూ లైన్ లోకి నేడు టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై గంటలకు పైగానే సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటలకుపైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు గంటలకు పైగానే సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 72,487 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 29,500 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.52 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News