TDP : టీడీపీ తీసుకున్న ఆ నిర్ణయంతో ఇక వారి ఆశలు గల్లంతయినట్లే

తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2025-12-26 07:55 GMT

తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం పార్టీలో సీనియర్ల శకం ఇక ముగిసినట్లే కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు నవతరం ఉరకలెత్తుతోంది. మొన్నటి ఎన్నికల తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్నప్పటికీ పార్టీ పూర్తిగా యువనేత లోకేశ్ చేతుల్లోకి వెళ్లిపోయింది. అంతెందుకు ప్రభుత్వం ఏర్పడిన మంత్రి వర్గం కూర్పు నుంచి నిన్నటి జిల్లా అధ్యక్షుల నియామకం వరకూ చూస్తే లోకేశ్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. తన యువగళం పాదయాత్రలో కనెక్ట్ అయిన యువలీడర్లకు లోకేశ్ పెద్ద పదవులు కట్టబెట్టడంలో వెనకాడటం లేదు. అదే రెండేళ్లుగా జరుగుతుంది. దీంతో సీనియర్లకు ఇక టీడీపీలో కనెక్షన్ కట్ అయినట్లే కనిపిస్తుంది. సీనియర్లు జీపీఎస్ లాంటి వారని యువలీడర్లు మిస్సైల్స్ వంటి వారని లోకేశ్ చెబుతున్నా వాస్తవానికి సీనియర్ నేతలు ఇక పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కనిపించకపోవచ్చు.

జిల్లా అధ్యక్షుల నియామకంలోనూ...
ఇటీవల జరిగిన జిల్లా అధ్యక్షుల నియామకంలోనూ అందరూ యువ నాయకులకే జిల్లా పార్టీ పగ్గాలను అప్పగించారు. వారంతా లోకేశ్ టీంగా ముద్ర పడిన వారే. సామాజిక వర్గాలను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ అందులోనూ లోకేశ్ సిఫార్సు చేసిన వారికే జిల్లా అధ్యక్ష పదవులు దక్కాయన్నది పార్టీ నేతలు అందరూ ఒప్పుకుంటున్న విషయం. సీనియర్లు ఇక సలహాలకే పరిమితమవ్వాల్సి ఉంటుంది. వారికి గౌరవం ఉంటుందంటూనే పదవులకు మాత్రం దూరం అని చేతల ద్వారా పార్టీ నాయకత్వం చెబుతుంది. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. గత కొన్ని దశాబ్దాలుగా నియోజకవర్గాల్లో పాతుకుపోయి మరొకరిని ఎదగనివ్వకుండా, పార్టీ జెండా పట్టుకుని కష్టపడి పనిచేసిన వారిని కూడా దరిదాపుల్లోకి రానివ్వకుండా సీనియర్లు జాగ్రత్తపడటంతో ఈ చర్యలకు నాయకత్వం పూనుకుందన్న టాక్ పార్టీలో వినిపిస్తుంది.
పదవులపై ఆశలు లేవు...
దీంతో సీనియర్ నేతలు ఇక పదవులపై ఆశలు వదులు కున్నారు. ఇప్పటికే చాలా మంది నేతలు తమ వారసులను పార్టీలోకి తెచ్చారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం ప్రస్తుతం ఉన్న సీనియర్ నేతలలో ఎవరికీ ఉండవన్న సిగ్నల్స్ ఇప్పటికే అందడంతో తమ వారసులను ఇప్పటి నుంచే నియోజకవర్గంలో తిప్పుతూ పార్టీ కార్యక్రమాల్లో వాళ్లనే ముందుంచే కార్యక్రమాలను చేపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా యువ నాయకత్వమే బరిలో ఉంటుందని సంకేతాలు నాయకులకు అందడంతో సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడే సర్దుకోవడం బెటరన్న ధోరణిలో ఉన్నారట. అందుకే దందాలకు తెరతీశారని కూడా అంటున్నారు. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ లో సీనియర్లకు ఇక నో ఛాన్స్ అని బోర్డు పెట్టేసినట్లేనని అన్న టాక్ బలంగా వినిపిస్తుంది.


Tags:    

Similar News