Ap Politics : కొత్త నినాదం అందుకుంటేనే.. లేకుంటే హిస్టరీ రిపీట్ అవుతుందట భయ్యా

ఆంధ్రప్రదేశ్ లో ఒక ఎన్నికలకు పనిచేసిన నినాదం మరొక ఎన్నికల్లో పనిచేయదు.

Update: 2025-06-17 07:01 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఒక ఎన్నికలకు పనిచేసిన నినాదం మరొక ఎన్నికల్లో పనిచేయదు. 2014 నుంచి ఇప్పటి వరకూ మూడు ఎన్నికలు జరిగాయి. ఈ మూడు ఎన్నికల్లోనూ ఒకసారి పనిచేసిన స్లోగన్ మరొకసారి పనిచేయలేదు. అందుకే నినాదాలతో పాటు రాజకీయ పార్టీలు కూడా స్ట్రాటజీలను మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇప్పటి వరకూ జరిగిన మూడు ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. అదే సమయంలో మూడు ఎన్నికల్లో మార్పును ప్రజలు కోరుకోవడం కనిపించింది. అవే పార్టీలు అయినప్పటికీ ఒకసారి గెలిచిన వారు మరుసటి ఎన్నికల్లో గెలవలేకపోవడం విశేషం. అదే సమయంలో అవినీతి, సంక్షేమ పథకాలను కూడా ప్రజలు పెద్దగా పట్టించకోకపోవడమూ ఏపీ ఎన్నికల ప్రత్యేకం.

లక్ష కోట్ల అవినీతి అంటూ...
2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలసి పొత్తుతో పోటీ చేశాయి. నాడు జనసేన బయట నుంచి కూటమికి మద్దతు తెలిపింది. రాష్ట్ర విభజన జరగడం, చంద్రబాబుపై అపార నమ్మకంతో పాటు జగన్ పై అవినీతి ఆరోపణలు కూడా పనిచేశాయి. మూడు పార్టీలు కలవడం వల్ల కొంత ఇంపాక్ట్ ఎన్నికల ఫలితాలపై కనిపించింది. అయినా నాడు వైసీపీ ప్రతిపక్షంలోకి వచ్చినప్పటికీ అరవై సీట్లకు పైగానే వచ్చి బలమైన పక్షంగా నిలబడింది. ప్రజలు జగన్ పై చేసిన అవినీతి ఆరోపణలను నాడు నమ్మారో లేదో తెలియదు కానీ, మొత్తం మీద 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. నాడు కాంగ్రెస్ కు ఒక్కస్థానం కూడా దక్కలేదు.
నాడు పోలవరం, అమరావతి...
2019 ఎన్నికల్లోనూ చంద్రబాబు అమరావతి, పోలవరం నినాదం అందుకున్నారు. జగన్ పై లక్షకోట్ల అవినీతి అంటూ నాడు నినాదాలు అందుకున్నారు. జగన్ తనకు ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వాలని జనాలను కోరారు. అమరావతి రాజధాని పోలవరం నిర్మాణం నినాదాలు చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో పనిచేయలేదు. సంక్షేమం, అభివృద్ధి అన్నది కూడా పెద్దగా పట్టించుకోలేదు. జగన్ పాదయాత్ర కారణమో, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలన్న నినాదమో తెలియదు కానీ వైసీపీకి భారీ మెజారిటీని కట్టబెట్టారు. 151స్థానాలతో వైసీపీ అధికారంలోకి రాగా, 23 స్థానాలకే టీడీపీ పరిమితమయింది. అయితే అప్పుడు టీడీపీ ఒక్కటే పోటీ చేసింది. బీజేపీ, జనసేనలు విడివిడిగా పోటీ చేశాయి.
బాబాయ్ హత్య.. సంక్షేమ నినాదాలు...
2024 ఎన్నికల్లో జగన్ సంక్షేమ పథకాల నినాదంతోనే ఎన్నికలకు వెళ్లారు. దాదాపు 2.40 లక్షల కోట్లు బటన్ నొక్కానని, లక్షల మంది ఖాతాల్లో నగదును వివిధ పథకాల రూపంలో అందచేశామని జగన్ ఎన్నికలకు వెళ్లారు. అయితే 2024లో 2014 కూటమి రిపీట్ అయింది. ఈసారి బీజేపీ, టీడీపీలతో కలసి జనసేన పోటీ చేసింది. జగన్ కుమించి సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు. సూపర్ సిక్స్ అంటూ, బాబాయ్ హత్య అంటూ ప్రజల ముందుకు వెళ్లడంతో టీడీపీ చరిత్రలోనే ఎన్నడూ రాని స్థానాలు వచ్చాయి. జగన్ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే పరిమితమయ్యాయి. అయితే ఈసారి ఈ నినాదాలేవీ కనిపించే అవకాశాలు మళ్లీ లేవు. కొత్త నినాదాలతో వెళ్లాల్సిన అవసరం ఇటు కూటమికి, అటు వైసీపీకి ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News