Andhra Pradesh : అటెండర్ కు కోట్ల ఆస్తి.. కిలోల కొద్దీ బంగారం, వెండి..మామూలోడు కాదుగా?
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసే అటెండర్ కు కోట్ల రూపాయల విలువై ఆస్తులున్నాయని ఏసీబీ అధికారుల దాడుల్లో తేలింది
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసే అటెండర్ కు కోట్ల రూపాయల విలువై ఆస్తులున్నాయని ఏసీబీ అధికారుల దాడుల్లో తేలింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక అటెండర్ కే ఇన్ని ఆస్తులుంటే ఇక ఉద్యోగులు, అధికారుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి వీలులేదు. ఆంధ్రప్రదేశ్ లోని రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న అటెండర్ కు ఆదాయానికి మించి ఆస్తులున్నాయని సమాచారం అందడంతో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో అటెండరా? లేక ఆఫీసరా? అన్న రేంజ్ లో ఆస్తులున్నట్లు గుర్తించి ఏసీబీ అధికారులే గుడ్లు తేలేశారు.
బినామీయేనా? అతనివేనా?
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు రేణిగుంట సబ్ రిజిస్టర్ ఆఫీస్ అటెండర్ తిరుమలేష్ ను ఏసీబీ అరెస్ట్ చేసింది. తిరుపతి, నెల్లూరు జిల్లాలోని ఆరు ప్రాంతాల్లో ఏకకాలంగా అధికారులు సోదాలు చేశారు. ఈ సందర్భంగా అటెండర్ తిరుమలేష్ ఇంటి నుంచి పదకొండు ఆస్తి పత్రాలు, 1.47 కేజీలు బంగారం, 8.77 కేజీలు వెండి, 15 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇంత రేంజ్ లో డబ్బులు దొరకడంతో ఈ ఆస్తులు ఇతనవేనా? లేక బినామీగా ఇతను వ్యవహరిస్తున్నాడా? అన్న కోణంలోనూ ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
బ్యాంకు లాకర్లు తెరిస్తే...
మరో రెండు బ్యాంకుల లాకర్లు తేరవాల్సి ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. అవి తెరిస్తే ఇంకెన్ని ఆస్తులు, నగదు, బంగారం బయటపడుతుందో? అవినీతి ఆరోపణల నేపథ్యంలో 2025 అక్టోబర్ లో అతడు సస్పెండ్ అయినట్లు చెబుతున్నారు. మర్రిపాడు మండలం,డీసీపల్లి లోని తిరుమలేష్ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇళ్లలో గురువారం రెండు బృందాలుగా ఏర్పడి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అవినీతికి చిరునామాలుగా మారాడనటానికి ఇంతకంటే నిదర్శనం మరేముంటుందన్న ప్రశ్నలు అందరిలోనూ కలుగుతున్నాయి.