TDP : రాజుగారికి సెగ మొదలయినట్లుందిగా?

ఉండి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజుకు సొంత పార్టీ నుంచి సెగ మొదలయింది.

Update: 2026-02-19 07:01 GMT

ఉండి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజుకు సొంత పార్టీ నుంచి సెగ మొదలయింది. రఘురామ కృష్ణరాజు ఏకపక్ష పోకడలకు పోతూ టీడీపీని నియోజకవర్గంలో దెబ్బతీస్తున్నారని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు. టీడీపీ ఉండి నియోజకవర్గ సీనియర్ నేత పొత్తూరి వెంకటేశ్వరరాజు రఘురామ కృష్ణరాజు పై విరుచుకుపడటం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. తాను రఘురామ కృష్ణరాజుపై చంద్రబాబు, లోకేశ్ కు కూడా ఫిర్యాదు చేస్తానని చెప్పుకొచ్చారు. టీడీపీ నేతలను పక్కన పెట్టడమే కాకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటూ, పేదలను ఇబ్బంది పెడుతూ పార్టీని ఇక్కడ పాతాళానికి రఘురామ కృష్ణరాజు తొక్కేస్తున్నారని ఆయన చేసిన వీడియా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వైసీపీ నుంచి వచ్చినా...
రఘురామ కృష్ణరాజు 2019 ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా వైసీపీ నుంచి గెలిచారు. అయితే వైసీపీ నాయకత్వంతో వచ్చిన విభేదాల కారణంగా ఆయన నాలుగేళ్ల పాటు అధికార పార్టీకి వ్యతిరేకంగా మారారు. రోజూ ఢిల్లీలో రచ్చ బండ పేరుతో వైసీపీ పాలనపై రచ్చ రచ్చ చేసేవారు. 2024 కు ముందు రఘురామ కృష్ణరాజు టీడీపీలో చేరారు. నరసాపురం ఎంపీ టిక్కెట్ ను ఆశించినా కూటమి పొత్తులో భాగంగా అది బీజేపీ కోటాలోకి వెళ్లిపోయింది. దీంతో ఆయనకు అప్పటి వరకూ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేకు టీడీపీ టిక్కెట్ ఇవ్వకుండా రఘురామ కృష్ణరాజుకు ఉండి టిక్కెట్ ను ఇచ్చింది. గెలిచిన తర్వాత రఘురామ కృష్ణరాజు వైఖరిపై టీడీపీ నేతల నుంచి విమర్శలు రావడం ఇప్పుడు కలకలం రేగుతుంది.
టీడీపీ నేతలను పట్టించుకోకుండా...
పేదల ఇళ్లను కూల్చివేయడంతో పాటు టీడీపీ నేతలను పట్టించుకోకుండా పార్టీ క్యాడర్ ను కూడా పట్టించుకోవడం లేదన్న విమర్శలు సీనియర్ నేత పొత్తూరి వెంకటేశ్వరరాజు చేయడంతో దీనిపై నాయకత్వం కూడా ఆరా తీయడం ప్రారంభించిందంటున్నారు. డిప్యూటీ స్పీకర్ ఉన్న రఘురామ కృష్ణరాజు నియోజకవర్గంలోనే అందుబాటులో ఉంటున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఉండి టీడీపీలో చెలరేగిన ఈ వివాదంతో కొంత పార్టీకి కూడా ఇబ్బందికరంగా మారింది. రఘురామ కృష్ణరాజు అవినీతికి పాల్పడే నేత కాదు. ఆయనకు ఆ అవసరం లేదు. మరి క్యాడర్ ను పట్టించుకోకుండా, తన గెలుపునకు కారణమయిన నేతలను పక్కన పెట్టడం కూడా ఈ వివాదానికి ప్రధాన కారణమన్న కామెంట్స్ వినపడుతున్నాయి. దీనిపై పార్టీ నాయకత్వం నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర పార్టీని ఆదేశించినట్లు సమాచారం.


Tags:    

Similar News