Weather Report : ప్రాజెక్టులు నిండాయి.. కానీ వానలు లేక మాత్రం తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులే

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కళకళ లాడుతున్నాయి. కాని వానలు పడటం లేదు

Update: 2025-08-01 03:47 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కళకళ లాడుతున్నాయి. జులై నెల వెళ్లిపోయింది. ఆగస్టు నెల వచ్చేసింది. కానీ సరైన రీతలో వానలు మాత్రం లేవు. గత కొద్ది రోజుల నుంచి వర్షాలు పడటం లేదు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులు నిండిపోతున్నాయి. దీంతో గేట్లు తెరిచి కిందకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతుంది. నాగార్జున సాగర్ కూడా నిండిపోయింది. ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా మూడు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఏపీ విపత్తలు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. అయితే గోదావరి నదిలో మాత్రం వరద నీటి ప్రవాహం తగ్గిందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద వరద నీరు క్రమంగా తగ్గుతుంది.

శ్రీశైలం జలాశయానికి...
మరొక వైపు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం జలాశయం వద్ద ప్రస్తుతం ఎనిమిది గేట్లు పది అడుగులు మేరకు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. శ్రీశైలం జలాశయం ప్రాజెక్టు వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో 2,93,609 క్యూసెక్కులుండగా ఔట్ ఫ్లో 2,82,502 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 882.80 అడుగులుగా ఉంది. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని అధికారులు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయడంతో నాగార్జున సాగర్ తో పాటు ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా వరద నీరు భారీ గా చేరుతుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
సాగర్ గేట్లు కూడా...
నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు కూడా తెరుచుకున్నాయి. సాగర్ ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 584.41 అడుగులకు చేరుకుంది. నాగార్జున సాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 295.7 టీఎంసీలకు చేరింది. దీంతో మూడు రోజుల క్రితమే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ లు నాగార్జున సాగర్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం సాగర్ లో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 28,785 క్యూసెక్కులను తెలంగాణ దిగువకు విడుదల చేసింది. పద్దెనిమిదేళ్ల తర్వాత జులై లో నాగార్జున సాగర్ గేట్లు తెరుచుకున్నాయి. కానీ వాతావరణ శాఖ సూచన మేరకు వచ్చే నెల రెండో వారం వరకూ వర్షాలు పడవని తెలిపింది. అప్పటి వరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశముంది.


Tags:    

Similar News