Andhra Pradesh : వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారా?
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మామూలుగా లేవు. ఇక వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మామూలుగా లేవు. ఇక వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీలు ఇలా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీలు, వైసీపీ అమితుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయి. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పెద్దగా ఇబ్బంది ఉండదు. అందులో పార్టీ సింబల్ ఉండదు. కాకపోతే పార్టీ బలపర్చిన అభ్యర్థులే గెలిచి సర్పంచ్, ఉప సర్పంచ్ లుగా ఎన్నికవుతారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా పార్టీ సింబల్ ఉండటం, బీఫారాలు కూడా ఉండటంతో వీటి ఫలితాలు అధికార, విపక్ష పార్టీలు రాజకీయాలపై ఒక అంచనాకు వచ్చేందుకు అవకాశముంటుంది.
సహజంగానే అధికార పార్టీకి...
స్థానిక సంస్థల ఎన్నికలు సహజంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. మరో నాలుగేళ్లు అధికారంలో ఉండటంతో అధికార పార్టీ వైపు ప్రజలు కూడా మొగ్గు చూపుతారు. అధికార పార్టీకి చెందిన వారు ఎన్నికయితే తమ సమస్యలను పరిష్కరిస్తారని భావించి అటు వైపు చూస్తారు. అయితే ఏపీ రాజకీయాలను నమ్మలేం. ప్రజల్లో ఉన్న అసంతృప్తి, సంతృప్తి పాళ్లను కొలమానంగా దీనిని పరిగణనలోకి తీసుకోవడానికి కూడా వీలులేదు. వైసీపీ హయాంలో జరిగిన స్థానికసంస్థల ఎన్నికల్లో ప్రజలు వైసీపీ వైపు మొగ్గు చూపారు. దాదాపు అన్ని కార్పొరేషన్లను వైసీపీ కైవసం చేసుకుంది. మున్సిపాలిటీల్లో తాడిపత్రి మినహాయిస్తే అన్నింటిని ఫ్యాన్ పార్టీ గెలుచుకుంది. పంచాయతీలంటే వైసీపీ అనుకూలురే ఎన్నికయ్యారు.
వైసీపీ, టీడీపీ నేతల ధీమా....
అయితే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజలు అధికార పార్టీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ ఫలితాలతో కూటమి ప్రభుత్వం తేలిపోవడం ఖాయమని ధీమాగా ఉన్నారు. కానీ టీడీపీ నేతల్లో ఏ మాత్రం బెరుకు, భయం లేదు. ఇప్పటికే సూపర్ సిక్స్ హామీల్లో ఎక్కువ భాగం అమలుచేయడంతో పాటు ఇంకా కొన్నింటిని అమలు చేయడానికి రెడీ అవుతుండటంతో ఎన్నికల సమయానికి తమకు గ్రౌండ్ అనుకూలంగా మారుతుందని టీడీపీ నేతలు లెక్కలు వేసుకుంటుున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు తమ నియోజకవర్గం, జిల్లాల పరిధిలో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో క్లీన్ స్వీప్ చేస్తామన్న నమ్మకం పసుపు పార్టీ నేతల్లో ఉంది.
అనేక అంశాలు ప్రభావితంచేసే...
కానీ అనేక అంశాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేస్తాయని చెప్పక తప్పదు. ఇచ్చిన హామీలు అమలయిన వారు హ్యాపీగా ఉంటారు. అమలు కాని వారు అసంతృప్తిగా ఉంటారు. పథకాలు దక్కని వారు ఖచ్చితంగా అధికార పార్టీపై అసహనంతో ఉంటారు. దక్కిన వారు మళ్లీ అధికార పార్టీ గుర్తుపైనే ఓటేస్తారు. అయితే అధికారంలో ఉన్న పార్టీ ఏ మేరకు పథకాలను అందించింది? ఎంత అభివృద్ధి ఆ ప్రాంతంలో ఈ ఏడాదిలో సాధించింది? అన్న దానిపైనే ఎక్కువగా స్థానికసంస్థల ఫలితాలు ఆధారపడి ఉంటాయి. మరొక వైపు అధికార పార్టీకి ఎటూ అధికారం అడ్వాంటేజీగా ఉంటుంది. అందుకే వచ్చే ఏడాది జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు జనం నుంచి సౌండ్ ఎలా వస్తుందన్నది చూడాల్సి ఉంది. అయితే ఈ ఫలితాలు సాధారణ ఎన్నికలకు ప్రభావితం చేయలేవని స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే నాలుగేళ్ల సమయం ఉంది కాబట్టి.