Janasena Party : పవన్ కల్యాణ్ మదిలో అదే ఉందా? అలాగే ఉంటే?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తనకు ఈ పదవి చాలు అన్న ధోరణిలో ఉన్నట్లు కనిపిస్తుంది.

Update: 2025-11-11 08:10 GMT

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తనకు ఈ పదవి చాలు అన్న ధోరణిలో ఉన్నట్లు కనిపిస్తుంది. రాజకీయాల్లోకి అనూహ్యంగా, ఆవేశంగా వచ్చిన పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం తనను తాను సంబాళించుకుంటున్నారు. ఎక్కువగా రాజీపడే ధోరణిని ప్రదర్శిస్తున్నారన్న అభిప్రాయం సొంత పార్టీ నేతలనుంచి ఎక్కువగా వినిపిస్తుంది. 2019 నుంచి 2024 ఎన్నికల ముందు వరకూ పవన్ కల్యాణ్ ను చూసిన వారికి ఎవరికైనా ఆయన ఏ విషయంలోనూ రాజీపడబోరని అంచనాలున్నాయి. అందులో ముఖ్యంగా కాపు సామాజికవర్గంలోనూ, పవన్ కల్యాణ్ అభిమానుల్లోనూ, జనసేన కార్యకర్తలు, నేతలు ఇదే రకమైన అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తుంది.

వచ్చే ఏడాది జనవరిలో...
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఏడాది జనవరి నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. అయినా సరే పెద్దగా పవన్ కల్యాణ్ పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. 2024 ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన తమకు ఏదో ఒక చిన్నా చితకా పదవి వస్తుందని అనుకునే వారు నాయకత్వ బాధ్యతలను గ్రామాల్లోనూ, మండలాల్లోనూ, జిల్లాల్లోనూ భుజాన కెత్తుకున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో తమకు పోటీకి దింపుతారన్న నమ్మకం నేతలకు లేకుండా పోయింది. ఇప్పటి వరకూ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి పార్టీ నాయకత్వం ఎలాంటి ముందు అడుగు వేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. కనీసం జిల్లా స్థాయిలో కూడా పవన్ కల్యాణ్ సమావేశాలను ఏర్పాటు చేయకపోవడంతో నేతలు నీరస పడుతున్నారు.
శాఖను చూసుకుంటూనే...
పవన్ కల్యాణ్ తన శాఖ బాధ్యతలను చూడటంలో తప్పులేదు. అలాగే ప్రత్యర్థి జగన్ పార్టీపై విమర్శలు చేయడాన్ని కూడా ఎవరూ తప్పుపట్టరు. కానీ సొంత పార్టీ నేతలను పట్టించుకోకపోతేనే అసలు ఇబ్బంది అని అంటున్నారు. దీనివల్ల ఈ పార్టీలో ఉంటే పదవులు వస్తాయా? రావా? అన్న అనుమానం చివర వరకూ టెన్షన్ పెడుతుందని, అప్పుడు కొందరు నేతలు పార్టీని వీడే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎవరైనా పదవుల కోసమే రాజకీయాల్లోకి వస్తారు. అది గుర్తించలేని పవన్ కల్యాణ్ కేవలం కూటమి వల్లే గెలుపు వస్తుందని నమ్మకంతో ఉండి, ఏవో కొన్ని సీట్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో తీసుకుంటే జనసేన కార్యకర్తలు, నేతలు కూడా ఇబ్బందిపడతారని హెచ్చరిస్తున్నారు. మరి పవన్ కల్యాణ్ ఇప్పటికైనా పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతంపై దృష్టి పెట్టాలని కోరుతున్నార. లేకపోతే గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలహీనమవుతుందని అంటున్నారు.


Tags:    

Similar News