Free Bus For Women : మహిళలకు ఉచిత బస్సు పథకం ఉగాది నుంచి అమలు కాదా?
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు పథకానికి బడ్జెట్ లో నిధులు కేటాయించకపోవడంపై విపక్షాలు విమర్శలకు దిగాయి
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు పథకానికి బడ్జెట్ లో నిధులు కేటాయించకపోవడంపై విపక్షాలు విమర్శలకు దిగాయి. ఉగాది నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే నిర్ణయించడంతో ఇది ప్రారంభమవుతుందా? లేదా? అన్న ప్రశ్న వారి నుంచి వస్తున్నాయి. సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు మాత్రమే నిధులను బడ్జెట్ లో కేటాయింపులు జరిపారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి కూడా కేటాయింపులు చేశారు. అయితే మహిళలకు ఉచిత బస్సు పథకంపై ఎలాంటి కేటాయింపులు లేవని, దీనిని అమలు చేసే ఉద్దేశ్యం ఉందా? లేదా? అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
నిధులు కేటాయించకపోవడంతో...
కానీ ప్రభుత్వ వర్గాలు నెలకు 260 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుండటంతో దీనికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాల్సిన పనిలేదని అధికార పార్టీ చెబుతుంది. దీనికి తోడు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రసంగంలోనూ ఉచిత బస్సు పథకం ప్రస్తావన లేకపోవడంతో కూటమి ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుందా? అన్న అనుమానాలు కూడా బలంగా కలుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. మిగిలిన ప్రయాణికులపై భారం మోపాల్సి వస్తుంది. అంతేకుండా దీనివల్ల ఆటో కార్మికుల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో ఈ పథకాన్ని కొంతకాలం ఆపుతారన్న ప్రచారం కూడా జోరుగా జరుగుతుంది.
పునరాలోచనలో పడ్డారా?
ఇప్పటికే దీనికి సంబంధించి మంత్రి వర్గ ఉప సంఘం ఈ పథకం అమలవుతున్న రాష్ట్రాల్లో పర్యటించి వచ్చి నివేదికను కూడా సమర్పించింది. మరోవైపు రవాణా శాఖ అధికారులు కూడా ఎప్పుడో ఈ పథకం వల్ల ఎంత భారం పడుతుందన్నది స్పష్టంగా తెలిపింది. కర్ణాటక, తమిళనాడుల్లో అమలవులున్న పథకంలో లోటుపాట్లను గుర్తించిన ప్రభుత్వం ఈ పథకంలో ఆంధ్రప్రదేశ్ లో మార్పులు చేయడానికి నిర్ణయించినట్లు తెలిసింది. కర్ణాటక, తమిళనాడుల్లో ఉచిత బస్సు పథకం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆర్టీసీ నష్టాల బారిన పడటమే కాకుండా ప్రభుత్వానికి భారంగా మారడంతో పాటు అక్కడ లోపాలు కూడా అమలు తర్వాత బయటపడింది. వీటిని అధిగమించడంపై మరింత కసరత్తులు చేయాలని భావిస్తునట్లు తెలిసింది. అందుకే బడ్జెట్ లో ఈ పథకం గురించి ప్రస్తావన లేదని మరికొందరు అంటున్నారు.
జిల్లాల వరకే అయినా...
అయితే తొలుత జిల్లాల వరకే ఉచిత బస్సు పథకాన్ని అమలుచేయాలని భావించారు. దానివల్ల పెద్దగా భారం పడదని కూడా లెక్కలు వేశారు. అయితే ఇందుకోసమయినా ఆర్టీసీ బస్సులను కొనుగో్లు చేయడంతో పాటు అదనపు సిబ్బందిని కూడా నియమించాల్సి ఉంంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదని భావించిన సర్కార్ వెనకడుగు వేసిందా? అన్న సందేహలు విపక్షాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఈ నెలలోనే మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభించాల్సి ఉండగా ఇప్పటి వరకూ దీనికి సంబంధించిన కసరత్తులు మొదలు కాలేదు. కొత్త బస్సులతో పాటు అదనపు సిబ్బంది నియామకానికి సంబంధించి ఏర్పాట్లు కూడా ప్రారంభం కాలేదు. అందువల్లనే అనుమానం తలెత్తుతుంది.