Vasireddy Padma : వాసిరెడ్డి పద్మ సైకిల్ ఎక్కేందుకు బ్రేకులు.. అవే కారణమా?

వైసీపీ మాజీ నేత వాసిరెడ్డి పద్మ చేరికకు తెలుగుదేశం పార్టీ లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

Update: 2025-06-15 08:51 GMT

తెలుగుదేశం పార్టీ తో పాటు జనసేన కూడా వైసీపీ నేతల్లో కొందరికి మాత్రమే అవకాశం కల్పిస్తుంది. ఎక్కువ మందిని చేర్చుకునేందుకు ఇష్టపడటం లేదు. చేర్చుకున్న తర్వాత ఉపయోగం లేదని వారిని తీసుకుని తర్వాత బాధ పడేకంటే ముందుగానే వారిని తీసుకోబోమని చెబుతుంది. వైసీపీలో ఒక వెలుగు వెలిగిన వాసిరెడ్డి పద్మ ఇప్పుడు ఎటు కాకుండా పోయారు. వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో టీడీపీలో చేరబోతున్నట్లు వెంటనే ప్రకటించారు. గత ఏడాది డిసెంబరు నెలలో ఆమె రాజీనామా చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను త్వరలో నే చేరుతున్నట్లు తెలిపారు. అయితే ఇంత వరకూ టీడీపీలో వాసిరెడ్డి పద్మ టీడీపీలో చేరలేదు.

ఐదు నెలల ముందే...
డిసెంబరు నెలాఖరులోనే చేరాల్సిన వాసిరెడ్డి పద్మ టీడీపీ కండువా మాత్రం కప్పుకోలేకపోయారు. అయితే వాసిరెడ్డి పద్మ చేరికకు టీడీపీ నేతలు అభ్యంతరం పెద్దయెత్తున చెప్పారు. వాసిరెడ్డి పద్మ మాటకారి. మంచి సబ్జెక్టు ఉన్న నేతగా పేరు. ప్రజారాజ్యం నుంచి ఆమె పార్టీకి అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. ప్రజారాజ్యంలోనూ ఎక్కువ రోజులు ఉండలేదు. తర్వాత ఆమె వైసీపీలో చేరి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు. కానీ వైఎస్ జగన్ మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ పదవి వరకే వాసిరెడ్డిని పరిమితం చేశారు. చివరకు జగన్ జిల్లాల పర్యటనలో కూడా ఆమె ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించారు. అయితే వైసీపీ ఓటమి తర్వాత పార్టీ నుంచి వైదొలిగారు.
కాపు సామాజికవర్గానికి చెందిన...
కాపు సామాజికవర్గానికి చెందిన వాసిరెడ్డి పద్మ తొలుత జనసేనలో చేరాలనుకున్నారు. అయితే అప్పటికే జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే జనసేనలో చేరతారన్న ప్రచారంతో వాసిరెడ్డి పద్మ ఆ ఆలోచనను మానుకున్నారు. అంతే కాదు జనసేనలో చేరేందుకు పవన్ కల్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దంతో ఆమె టీడీపీలో చేరేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. వాసిరెడ్డి పద్మ జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందిన వారు. జగ్గయ్యపేట టిక్కెట్ కోసం గత ఎన్నికల్లో వైసీపీ నుంచి తీవ్రంగానే పోటీ పడ్డారు. కానీ జగన్ మాత్రం టిక్కెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. అప్పటి నుంచే కొంత అసంతృప్తితో ఉన్న వాసిరెడ్డి పద్మ వైసీపీ అధికారంలోకి వస్తుందేమోనని ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ వెయిట్ చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీకి వాసిరెడ్డి రాజీనామా చేశారు. జగన్ పార్టీపై విమర్శలు చేసి ఆమె బయటకు వచ్చారు.
కేశినేనితో రాయబారాలు...
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేనిచిన్నిని కలిసి ఆయన ద్వారా పార్టీలో చేరాలని వాసిరెడ్డి భావించారు. మూడు సార్లు కేశినేని చిన్నితో వాసిరెడ్డి పద్మ సమావేశమయ్యారు. కేశినేని చిన్ని కూడా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో మాట్లాడి ఓకే చేయించినట్లు ప్రచారం జరిగినా అందుకు చంద్రబాబు మాత్రం అంగీకరించలేదని తెలిసింది. వైసీపీ లో ఉన్నప్పుడు తమపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన వారిని వెంటనే పార్టీలోకి తీసుకుంటే కార్యకర్తల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని చంద్రబాబు నో చెప్పినట్లు తెలిసింది. దీంతో వాసిరెడ్డి పద్మ సైకిల్ పార్టీలో చేరికకు బ్రేకులు పడ్డాయని అంటుున్నారు. వాసిరెడ్డి పద్మ చేరికపై కొందరు జిల్లా నేతలతో పాటు మహిళ నేతలు అభ్యంతరం చెప్పడంతో అది ఆగిపోయిందని అంటున్నారు. దీంతో వైసీపీకి రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మ ఏ పార్టీలోకి ఎంట్రీ లేక ఎటూ కాకుండా పోయారు.


Tags:    

Similar News