Ap BJP : ఎవరిదో పై చేయి... ఏపీ బీజేపీ కేంద్ర నాయకత్వం వ్యూహం మారుస్తుందా?

బీజేపీ ఏపీ అధ్యక్ష ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ ను రేపు విడుదల చేయనున్నారు

Update: 2025-06-28 07:01 GMT

ఆంధ్రప్రదేశ్ బీజేపీకి కొత్త నాయకత్వం రాబోతుందా? బీజేపీ కేంద్ర నాయకత్వం వ్యూహం మారుస్తుందా? చిన్నమ్మను తప్పిస్తుందా? కొత్త వ్యక్తికి పగ్గాలు అప్పగించనున్నారా? అంటే అవుననే అంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి తాజాగా అప్ డేట్ వచ్చేసింది. బీజేపీ ఏపీ అధ్యక్ష ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ ను రేపు విడుదల చేయనున్నారు. ఈ నెల 30వ తేదీన నుంచినామినేషన్లను స్వీకరిస్తారు. ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం1 గంటల వరకూ నామినేషన్లను స్వీకరిస్తారు. నాలుగు గంటల్లోపు ఉప సంహరణకు సమయం ఉంటుంది. జులై 1వ తేదీన నూతన అధ్యక్షుడి పేరును ప్రకటిస్తారు. ఎన్నికల పరిశీలకుడిగా పీసీ మోహన్ వ్యవహరిస్తారు.

కేంద్ర నాయకత్వం ఆలోచన...?
ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంద్రీశ్వరిని కొనసాగిస్తారా? లేక కొత్త వ్యక్తికి బాధ్యతలను అప్పగిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే బీజేపీ కేంద్ర నాయకత్వం ఆలోచన ఎలా ఉందన్నది ఆసక్తికరంగానూ ఉత్కంఠతతోనూ ఉంది. 2024 ఎన్నికల్లో పురంద్రీశ్వరి బీజేపీ అధ్యక్షురాలిగా ఉండటంతో కూటమి ఏర్పడింది. పొత్తులు సజావుగా జరిగాయి. అయితే పురంద్రీశ్వరి పదవీ కాలం పూర్తి కావడంతో ఖచ్చితంగా తిరిగి అధ్యక్ష ఎన్నిక జరగాల్సి ఉంది. బీజేపీలో ఓటర్ల జాబితాను కూడా నేడు విడుదల చేయనున్నారు. ఎన్నిక నామమాత్రమేనని, కేంద్ర నాయకత్వం ఇప్పటికే ఒకపేరును ఖరారు చేసి ఉంటుందన్న ప్రచారం మాత్రం జరుగుతుంది.
రెండు వర్గాలుగా...
ఎవరు అవునన్నా కాదన్నా ఏపీ బీజేపీలో రెండు గ్రూపులున్నాయి. ఒకటి చంద్రబాబు వ్యతిరేక వర్గం కాగా, మరొకటి అనుకూల వర్గం. ఒకవర్గం చంద్రబాబు తో పొత్తు కారణంగానే రాష్ట్రంలో ఎదగలేకపోతున్నామని భావించే వారుండడగా, టీడీపీ మద్దతు లేకుండా సింగిల్ సిటు కూడా గెలవలేని పరిస్థితుల్లో కలసి నడవడమే మంచిదన్నది మరొకవర్గం అభిప్రాయం. భిన్నాభిప్రాయాలతో రెండు వర్గాల్లో ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏ వర్గానికి చెందిన వారు బీజేపీ అధ్యక్షుడవుతారన్నది కూటమి పార్టీల్లోనూ టెన్షన్ నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు ఎలా ఉన్నాయన్నది ఈ ఎన్నిక ద్వారా అర్థమవుతుందని, జగన్ పార్టీ నేతలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తం మీద జరిగేది బీజేపీ అధ్యక్ష ఎంపిక అయినా ఏపీ రాజకీయాల్లో మాత్రం భవిష్యత్ పరిణామాలను సూచిస్తుందని చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?



Tags:    

Similar News