Nara Lokesh : లోకేశ్ వచ్చే ఎన్నికలపై ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టారా?

నారా లోకేశ్ కూటమి ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు

Update: 2026-02-12 07:55 GMT

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూటమి ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నారా లోకేశ్ ప్రజా దర్బార్ ను ఉండవల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి అనేక మంది ఈ ప్రజాదర్బార్ కు హాజరవుతూ వినతులను అందచేస్తున్నారు. వంద శాతం ఈ సమస్యలను పరిష్కరించకపోయినప్పటికీ దాదాపు ఎనభై శాతం సమస్యలు పరిష్కారమవుతున్నాయి. లోకేశ్ ప్రజాదర్బార్ కు వెళితే తమ సమస్యలను పరిష్కారం అవుతాయని భావించి అన్ని నియోజకవర్గాల నుంచి ఎక్కువ మంది ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు.

ఎమ్మెల్యేల కుటుంబాలతో డిన్నర్...
ఇక తాజాగా నారా లోకేశ్ మరొక కొత్త సంప్రదాయానికి మంత్రి శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులతో సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ఒక్కోరోజు ఒక్కో పార్లమెంటు నియోజకర్గ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలకు కుటుంబ సమేతంగా నారా లోకేశ్ డిన్నర్ సమావేశాన్ని నిర్వహించనున్నారు.ఎమ్మెల్యేలతో పాటు వారి కుటుంబ సభ్యులను కలుసుకుని వారి సమస్యలను గురించి నారా లోకేశ్ తెలుసుకోనున్నారు. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఆయన చర్చించనున్నారు. ఈరోజు చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. వారి సమస్యలను వినడంతో పాటు వారితో ఫొటోలు దిగి వారితో కాసేపు గడపనున్నారు.
టీడీపీ సోషల్ మీడియాలో...
ఇక కార్యకర్తల సమావేశాలను ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న టీడీపీ కార్యకర్తలను ప్రోత్సహిస్తూ వారికి గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించారు. దీనివల్ల టీడీపీ సోషల్ మీడియా మరింత యాక్టివ్ అవుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికారంలో లేనప్పుడు యాక్టివ్ గా సోషల్ మీడియాలో ఉండే కార్యకర్తలు అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు దక్కలేదని, మరికొన్ని కారణాలతో వారు యాక్టివ్ గా లేకపోవడాన్ని గుర్తించిన నారా లోకేశ్ వారిని మరింత యాక్టివేట్ చేసేందుకు ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించినట్లు తెలిసింది. మొత్తం మీద బలగాన్ని మూడేళ్ల ముందు నుంచే ఎన్నికలకు నారా లోకేశ్ సిద్ధం చేస్తున్నారు. మరి యాక్టివ్ గా ఉండే కార్యకర్తలకు ఎలాంటి ప్రోత్సాహకాలు అందిస్తారన్నది చూడాలి.


Tags:    

Similar News