TDP : హీటెక్కిన నందిగామ పాలిటిక్స్... టీడీపీ ఎమ్మెల్యే వెనక ఉన్నదెవరు?

టీడీపీ అధినాయకత్వంపై నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తిరుగుబాటు చేశారు. తన అభ్యర్థిని ఎన్నికల బరిలో దింపుతున్నారు

Update: 2025-02-04 06:07 GMT

కూటమి ప్రభుత్వంలో టీడీపీ ఎమ్మెల్యే పార్లమెంటు సభ్యుడి ఆదేశాలను థిక్కరించారంటే అందుకు ఏదో పెద్ద కారణం ఉంటుంది. లేకుంటే ఎమ్మెల్యే వెనక బడా నేత ఎవరైనా ఉండి ఉంటారు. లేకుంటే ఒక ఎమ్మెల్యే అధిష్టానం ఆదేశాలను థిక్కరించడం అనేది టీడీపీ చరిత్రలో జరగదు. పార్టీ అధినాయకత్వం నిర్ణయించిన వారిని కాదని తన వర్గానికే మున్సిపల్ ఛైర్మన్ పదవి ఇవ్వాలంటూ నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య భీష్మించుకు కూర్చున్నారు. అంతటితో ఆగలేదు. ఎంపీ నిర్ణయాన్ని తప్పుపడుతూ తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపేందుకు సిద్ధమయ్యారు. ఇది ప్రస్తుతం టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే చివరికి పార్టీ నాయకత్వం నిర్ణయించిన అభ్యర్థి కృష్ణకుమారి గెలిచినట్లు ఆర్డీవో ప్రకటించారు. టీడీపీకి అనుకూలంగా పదహారు, వైసీపీకి మూడు ఓట్లు వచ్చాయి. కృష్ణకుమారి నందిగామ మున్సిపల్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. ఎంపీ నిర్ణయానికి చెక్ పెట్టగలిగారు.

ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య...
నందిగామ మున్సిపాలిటీలో పదమూడు మంది టీడీపీ వార్డు సభ్యులున్నారు. ఒక జనసేన సభ్యులున్నారు. అయితే నిన్ననే నందిగామ మున్సిపల్ ఎన్నిక జరగాల్సి ఉండగా విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని చిన్ని ఒక పేరును ఛైర్మన్ పదవికి ప్రతిపాదించారు. దీనికి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాత్రం అంగీకరించలేదు. ఎంపీ కేశినేని చిన్న స్వర్ణలేత పేరును సిఫార్సు చేయగా, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాత్రం సత్యవతి పేరును ఖరారు చేశారు. దీంతో నిన్న జరగాల్సిన సమావేశం ఈ ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరక పోవడంతో అధికారులు వాయిదా వేశారు. అధినాయకత్వం నచ్చ చెప్పినా తంగిరాల సౌమ్య ససేమిరా అనడంతో ఈరోజు ఆసక్తికరమైన విషయాలు చోటు చేసుకున్నాయి.
అధినాయకత్వాన్ని థిక్కరించి...
ఇదిలా ఉండగా ఈ ఇద్దరిని కాదని పార్టీ అధినాయకత్వం మరోపేరును సూచించింది. పార్టీ హైకమాండ్ కృష్ణకుమారి పేరును మున్సిపల్ ఛైర్మన్ పదవికి ఖరారు చేసింది. కృష్ణకుమారికే బీ ఫారం ఇచ్చేసింది. అయితే ఇందుకు కూడా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అంగీకరించలేదు. పదోవార్డు కౌన్సిలర్ స్వర్ణలతకు కాకుండా, ఇటు సత్యవతి కాకుండా కృష్ణకుమారికి పార్టీ హైకమాండ్ బీఫారం ఇవ్వడం పట్ల ఎమ్మెల్యే వర్గీయులు అభ్యంతరం చెబుతున్నారు. తాను లోకల్ అని, తన మాటే చెల్లుబాటు కావాలని తంగిరాల సౌమ్య అంటున్నారు. తాను మద్దతు నిచ్చిన సత్యవతి చేత బీఫారం లేకుండానే నామినేషన్ వేయించడానికి సౌమ్య సిద్ధం కావడంతో నందిగామ టీడీపీ లో రచ్చ మొదలయిందనే చెప్పాలి. కానీ చివరి నిమిషంలో తంగిరాల సౌమ్య విరమించుకుని పార్టీ హైకమాండ్ నిర్ణయించిన అభ్యర్థి కృష్ణకుమారికి మద్దతిచ్చి ఎంపీపై పై చేయి సాధించినట్లయిందని సౌమ్య వర్గీయులు అంటున్నారు.





Tags:    

Similar News