Tadipathri : తాడిపత్రికి వచ్చిన పెద్దారెడ్డి .. అడ్డుకునేందుకు యత్నించిన ప్రభాకర్ రెడ్డి

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రావడంతో ఆయన వర్గీయులను మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకున్నారు

Update: 2025-06-29 06:12 GMT

అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో టెన్షన్ మామూలుగా లేదు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రావడంతో ఆయన వర్గీయులను మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకున్నారు. దాదాపు ఏడాది నుంచి తాడిపత్రికి కేతిరెడ్డి పెద్దారెడ్డి రాలేదు. అయితే ప్రత్యర్ధులుదాడి జరిగే అవకాశం ఉండడంతో పెద్దారెడ్డిని తాడిపత్రికి అనుమతించలేదు. తాడిపత్రి వెళ్లేందుకు గతంలోనే హైకోర్టు పెద్దారెడ్డికి అనుమతి ఇవ్వడంతో ఆయన నేడు వచ్చారు. తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతించినా పోలీసులు వెళ్లనివ్వడం లేదని మరోసారి హైకోర్టును పెద్దారెడ్డి ఆశ్రయించారు. పోలీసులు హైకోర్టు ఆదేశాలు పాటించడం లేదని ఇటీవల కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. దీంతో నేడు పెద్దారెడ్డి తాడిపత్రి వస్తుండటంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

తన అనుచరులతో కలసి...
తాడిపత్రిలోని తన సొంత ఇంటికి పెద్దారెడ్డి చేరుకోవడంతో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలసి ఆయన ఇంటికి బయలుదేరారు. తాడిపత్రికి రావడానికి వీలు లేదని, తక్షణం వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్దయెత్తున టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. పెద్దారెడ్డి ఇంటిని చుట్టుముట్టేందుకు జేసీ అనుచరులు ప్రయత్నించడంతో పోలీసులు వారికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే పెద్దారెడ్డి ఇంటికి సమీపంలోనే జేసీ వర్గీయులు అక్కడ తిష్ట వేసి ఉండటం, పెద్దారెడ్డి నివాసంలో ఆయన అనుచరులు కూడా ఉండటంతో టెన్షన్ నెలకొంది.
ఎవరిక వారే...
అయితే పెద్దారెడ్డిని తాడిపత్రికి రావడానికి అడ్డుకోవడానికి జేసీ ఎవరు అని పెద్దారెడ్డి వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా పర్యటించే అవకాశముందని, హక్కులున్నాయని, ఇది జేసీ జాగీరుకాదని వారు వార్నింగ్ ఇస్తున్నారు. అదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు కూడా గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడికి దిగినప్పుడు ఏమయిందని ప్రశ్నిస్తున్నారు. తాడిపత్రిలోకి వస్తే తాము ఖచ్చితంగా దాడికి దిగుతామని జేసీ ప్రభాకర్ రెడ్డి నేరుగా హెచ్చరికలు చేయడంతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి మాత్రం ప్రస్తుతం తాడిపత్రిలోని ఆయన ఇంట్లోనే ఉన్నారు. ఎప్పుడు ఏంజరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది.
Tags:    

Similar News