Achnnaidu : అచ్చెన్నకు మంత్రిపదవి ఊపరిసలపనీయకుండా చేస్తుందా?
అచ్చెన్నాయుడు మాత్రం మంత్రిపదవిలో ఉన్నా ఆనందం మాత్రం లేదు
కింజారపు కుటుంబం అంటే సిక్కోలు జిల్లాలో తిరుగులేదు. ఇప్పుడు ఆ కుటుంబం నుంచి ఒకరు రాష్ట్రమంత్రిగా, మరొకరు కేంద్ర మంత్రిగా ఉన్నారు. కేంద్ర మంత్రిగా కింజారపు రామ్మోహన్ నాయుడు పౌరవిమానయాన శాఖను చేపట్టారు. యువకుడు కావడంతో ఆయనకు ఢిల్లీలో చంద్రబాబు కీలక బాధ్యతలను అప్పగించారు. అతి చిన్న వయసులో కేంద్ర మంత్రి అయిన రామ్మోహన్ నాయుడు మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే ఇటీవల అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం ఘటనతో కొంత ఇబ్బంది పడినా ఆయన పనితీరు విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. రామ్మోహన్ నాయుడుకు తెలుగుదేశం పార్టీలోనూ మంచి ప్రయారిటీ లభిస్తుంది.
వ్యవసాయశాఖ కావడంతో...
అయితే ఇదే సమయంలో రామ్మోహన్ నాయుడు బాబాయి అచ్చెన్నాయుడు మాత్రం మంత్రిపదవిలో ఉన్నా ఆనందం మాత్రం లేదు. అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండటమే ఇందుకు కారణం. అందరు మంత్రులదీ ఒక ఎత్తు. అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యవసాయ శాఖ మరొక ఎత్తు. నిరంతరం ఏదో ఒక సమస్య అచ్చెన్నాయుడును శాఖాపరంగా వెంటాడుతూనే ఉంది. ఇబ్బందులు పెడుతూనే ఉన్నాయి. క్షణం తీరిక లేకపోయినా ఏదో ఒక సమస్య మెడకు వచ్చి చుట్టుకుంటుంది. ఒక సమస్య నుంచి బయటపడ్డామని భావించే లోపు మరొక సమస్య వచ్చి పడుతుండటంతో అచ్చెన్నాయుడుకు ఊపిరిసలపకుండా చేస్తున్నాయనే చెప్పాలి.
గిట్టుబాటు ధరలు లేక...
సహజంగా హోం మంత్రికి కొన్ని ఇబ్బందులుంటాయి. కానీ అదేమి విచిత్రమో కానీ ఈ ఏడాదికాలంలోనే వ్యవసాయ శాఖ మంత్రికి వచ్చినన్ని కష్టాలు ఏ శాఖకు రాలేదంటే అది అచ్చెన్న దురదృష్టమేనని సొంత పార్టీ నేతలే అంటున్నారు. వ్యవసాయ శాఖలో మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు పనితీరుపైన కూడా ఇవి ప్రభావం చూపే అవకాశముందంటున్నారు. పొగాకు, మిర్చి, మామిడి పంటలకు సరైన గిట్టుబాటు రాకపోవడంతో రైతులు రోడ్డెక్కారు. దీంతో విపక్షనేత వైఎస్ జగన్ మూడు చోట్లకు మిర్చి రైతులను గుంటూరులోనూ, పొగాకు రైతులను పొదిలిలోనూ, మామిడి రైతులను చిత్తూరులోనూ పరామర్శించారు. దిగుబడి ఈ ఏడాది ఎక్కువ కావడంతో గిట్టుబాటు ధరలు లభించడం లేదని ప్రభుత్వం చెబుతోంది.
ఖరీఫ్ ప్రారంభం కావడంతో...
ఖరీఫ్ సాగు ప్రారంభమయిన నేపథ్యంలో రైతులు అన్ని పంటలను వేశారు. దీనికి తోడు నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించినా వానలు కూడా పడకపోవడంతో సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. వేసిన పంటలు కూడా నీరు అందక ఎండిపోయే పరిస్థితికి వచ్చింది.దీంతో పాటు యూరియా దొరక్క రైతులు రోడ్డెక్కుతున్నారు. యూరియా కొరత కారణంగా రైతులు రైతుసేవా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. యూరియా కొరతతో రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరొకవైపు అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు కూడా జమ కాకపోవడంతో మొత్తం మీద అచ్చెన్న శాఖ అస్తవ్యస్థంగా మారిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.