Weather Report : బాంబు పేల్చిన వాతావరణ శాఖ.. ఇక వానలే వానలు
ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది
ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీలంక సమీపంలోని నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం రాబోయే కొన్ని గంటల్లో బలపడి, జనవరి ఎనిమిదో తేదీ లేదా తొమ్మిదో తేదీ నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో జనవరి 9వ తేదీ నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రెండు మూడు రోజుల్లో అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తెల్లవారుజామున దట్టమైన పొగమంచుకురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
వానలు పడతాయని...
ఆంధ్రప్రదేశ్ లో గత కొంతకాలంగా చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. దీనికి తోడు వర్షాలు కూడా తోడయితే ప్రజలు ఇబ్బందులు పడక తప్పదు. సంక్రాంతి పండగకు ముందు వానలు పడటం కొంత ఇబ్బందులకు గురి చేసే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. అందులోనూ చలితీవ్రత నుంచి బయటపడతామని అనుకుంటున్న సమయంలో వాతావరణ శాఖ బాంబు పేల్చడంతో ప్రజలు ఇదేమి ఖర్మరా బాబూ అని తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే చలిగాలులు, పొగమంచు కారణంగా వ్యాపారాలు లేక లబోదిబోమంటున్న చిరు వ్యాపారులు కూడా వానలు దెబ్బకు మరింత తమ వ్యాపారాలు దెబ్బతింటాయేమోనని ఆందోళన వ్యక్తమవుతుంది.
ఎక్కువయిన చలితీవ్రత...
తెలంగాణలోనూ చలిగాలుల తీవ్రత సోమవారం నుంచి ఎక్కువగా కనిపిస్తుంది. అంతకు ముందు రెండు, మూడు రోజులు ఉష్ణోగ్రతలు పెరగడంతో చలి తగ్గిందని భావిస్తున్న ప్రజలకు ఒక్కసారిగా చలితీవ్రత పెరగడంతో ఇంకా ఎన్నాళ్లుంటుందన్న ఆవేదన చెందుతున్నారు. సంక్రాంతి వరకూ ఇలాంటి వాతావరణమే ఉంటుందని, రానున్న రెండు, మూడు రోజుల్లో చలితీవ్రత మరింత ఎక్కువవుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పొగమంచు కూడా అధికంగా ఉంటుందని చెబుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు ఉదయం, సాయంత్రం వేళ బయటకు రాకపోవడమే మంచిదన్న సూచనలు వైద్యుల నుంచి అందుతున్నాయి.