Weather Report : ఈ జిల్లాల్లోనే వానలు.. మిగిలిన చోట్ల ఎండలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక అప్ డేట్ ఇచ్చింది

Update: 2026-02-22 04:15 GMT

హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం పై విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆ తరువాత ఇది పశ్చిమ–వాయువ్య దిశగా కదిలే అవకాశముందని పేర్కొంది.ఈ ప్రభావంతో ఆదివారం కడప, అన్నమయ్య మదనపల్లె లో , చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని వెల్లడించారు. ఉరుములు, పిడుగులు పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద నిలవకూడదని, ఖాళీ ప్రదేశాల్లో ఉండకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

గణనీయంగా...
అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు గణనీయంగా నమోదవుతున్నాయి. అయితే తాజాగా తావరణ శాఖ సూచనతో కొంత ఊరట కలిగినా తర్వాత మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మార్చి నెల మొదటి వారం నుంచి గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. మార్చి నుంచి ఇక జూన్ వరకూ మూడు నెలల పాటు భానుడి ప్రతాపం ఏ మేరకు ఉంటుందో కూడా అంచనా వేయలేని పరిస్థితి ఉందని కూడా అంటున్నారు. గతంలో కంటే ఎక్కువ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవ్వడమే కాకుండా, సెగలు పొగలుతో మంట లేపుతుందని కూడా వాతావరణ శాఖ అధికారులు అలెర్ట్ జారీ చేస్తున్నారు.
వానలు పడిన తర్వాత...
తెలంగాణలోనూ వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే వడగళ్ల వానలు పడతాయని, కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సాధరణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు ప్రస్తుతం నమోదవుతున్నాయని, వర్షం పడి వెలిసిన తర్వాత మాత్రం తెలంగాణలోనూ గరిష్ట స్థాయి ఎండల తీవ్రత చేరుకుంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు మార్చి నెల నుంచి దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిదన్న సూచనలు వినిపిస్తున్నాయి. 2023 తరహా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందన్న హెచ్చరికలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి.


Tags:    

Similar News