Asmith Reddy : అస్మిత్ రెడ్డి ఇలా ఓపెన్ అయిపోయారేంటబ్బా?

తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి బహిరంగంగానే ప్రభుత్వం వద్ద నిధులు లేవని చెప్పారు

Update: 2026-02-21 08:07 GMT

తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి బహిరంగంగానే ప్రభుత్వం వద్ద నిధులు లేవని చెప్పారు. కూటమి పార్టీలో ఇది చర్చనీయాంశమైంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయం వచ్చేస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఖజానా బోసిపోయింది. మున్సిపాలిటీల్లో పనులు జరగక కూటమి నేతల్లోనే ఆందోళన వ్యక్తమవుతుంది. అభివృద్ధి పనులకు నిధులు కేటాయింపు జరగడం లేదు. తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ఈ విషయాన్ని సూటిగా చెప్పారు. సంక్షేమ పథకాలకు నిధులు ఖర్చు చేస్తుంటే ఇక అభివృద్ధి పనులకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయని అస్మిత్ రెడ్డి సభలో ప్రజలను ప్రశ్నించడం చూస్తే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ఎలా నెగ్గుకు రాగులుతుందన్న అనుమానం ఎవరికైనా కలుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా సంక్షేమంపై దృష్టి పెట్టింది.

సంక్షేమానికే ఎక్కువ నిధులు...
అభివృద్ధి పనులకు కంటే వెల్ ఫేర్ స్కీమ్ లకే ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంప్రెషన్ అని భావించి సంక్షేమానికి ఎక్కువ నిధుల కేటాయిస్తుంది. అభివృద్ధి పనులను ఎన్నికలకు రెండేళ్లు ముందు చేపడితే సరిపోతుందన్న నమ్మకంతో ఉంది. కానీ కూటమి పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లోనే నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులతో అవసరం లేని పనులను మాత్రం వారు చేయగలుగుతున్నారు. ఇక కూటమి ప్రభుత్వం మరో ప్రాధాన్యత రాజధాని అమరావతి కూడా కావడంతో దానికి వెచ్చించిన నిధులు మిగిలిన ప్రాంతాల అభివృద్ధికి కేటాయించడం లేదన్న అసహనం కూడా కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల్లో ఉంది.
సూపర్ సిక్స్ పథకాలను...
తాము అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలంటేనే కూటమి ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుకున్న స్థాయిలో ఆర్థిక సాయం అందడం లేదన్నది కూడా వాస్తవం. మాట సాయం తప్ప.. మూటల సాయం మాత్రం లేవనన్నది వాస్తవం. అందుకే ఇప్పుడు కూటమి సర్కార్ నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలపై ఫోకస్ పెట్టాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారు బహిరంగంగానే చెబుతున్నారు. తాడిపత్రి నియోజకవర్గం ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి మాటలు నాయకత్వానికి చేరతాయా? లేదా? అన్నది చూడాలి.


Tags:    

Similar News