జగన్ షాక్ లకు జనం భయపడిపోతున్నారు

జగన్ పాలనలో ప్రజలు క్షణం క్షణం భయపడుతూనే గడుపుతున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.

Update: 2022-04-01 12:57 GMT

జగన్ పాలనలో ప్రజలు క్షణం క్షణం భయపడుతూనే గడుపుతున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఎప్పుడు ఎలాంటి పన్ను ప్రజలపై పడుతుందో అర్థంకాక బెంబేలెత్తుతున్నారని అన్నారు. విద్యుత్తు ఛార్జీల పెంపుదలను నిరసిస్తూ ఈరోజు జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేసింది. కలెక్టర్లకు వినతి పత్రాలను అందించింది. కాకినాడ కలెక్టరేట్ వద్ద నాదెండ్ల మనోహర్ జనసేన ఆందోళనల్లో పాల్గొన్నారు.

ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి....
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారన్నారు. ఫ్యాన్ స్విచ్ వేయాలంటే ప్రజలు భయపడిపోతున్నారన్నారు. విద్యుత్తు ఛార్జీలను అడ్డగోలుగా ప్రభుత్వం పెంచిందని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. విద్యుత్తు ఛార్జీలు తగ్గించేంత వరకూ జనసేన తమ పోరాటం చేస్తుందని, ప్రజలకు అండగా నిలబడుతుందని ఆయన భరోసా ఇచ్చారు.



 


వేయని పన్ను ఏదీ?
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వేయని పన్ను అంటూ ఏమీ లేదన్నారు. చివరకు చెత్త పన్ను కూడా వేశారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. విద్యుత్తు ఛార్జీల భారం ప్రతి ఇంటిపై రూ.500 లకు పైగానే పడుతుందని చెప్పారు. జగన్ రెడ్డి పాలనపై ప్రజల్లో అసంతృప్తి ప్రారంభమయిందని, ఇక జగన్ పార్టీని ఎవరూ రక్షించలేరని నాదెండ్ల మనోహర్ అన్నారు. జనసేన ప్రజాపక్షాన నిలబడి సమస్యలపై పోరాడుతుందని చెప్పారు.


Tags:    

Similar News