Nagababu : నాగబాబు మంత్రి పదవి హుష్ కాకేనా?
జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు మంత్రి పదవి దక్కే అవకాశం కనిపించడం లేదు
జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు మంత్రి పదవి దక్కే అవకాశం కనిపించడం లేదు. ఆయనకు మంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు. అంతకు ముందయితే నాగబాబుకు శాఖలను కేటాయిస్తూ కూడా పెద్దయెత్తున ప్రచారం జరిగింది. అయితే ఇప్పటి వరకూ నాగబాబుకు మంత్రిపదవి ఊసే ఇప్పుడు వినపడటకపోవడం వెనక అనేక కారణాలున్నాయని అంటున్నారు. ఎమ్మెల్సీ అయిన వెంటనే నాగబాబును మంత్రి పదవిలోకి తీసుకుంటామని స్వయంగా పవన్ కల్యాణ్ తో పాటు చంద్రబాబు నాయుడు కూడా మీడియా చిట్ చాట్ లో ప్రకటించడంతో ఆయనకు మంత్రి పదవి ఖాయమనుకున్నారు. కానీ తర్వాత ఇటు చంద్రబాబు, అటు పవన్ కల్యాణ్ లు ఇద్దరూ ఈ విషయంలో కొంత ఆలోచనలో పడినట్లు సమాచారం.
సామాజికవర్గం కూడా...
నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ ఇస్తారని ప్రచారం కూడా జరిగింది. నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడం వల్ల ప్లస్ లు, మైనస్ లు బేరీజు వేసుకుంటే తీసుకోకపోవడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్లుంది. ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో ఇంకా ఒక పదవి ఖాళీగా ఉంది. ఆ పదవిలో నాగబాబు కంటే వేరు వారికి ఇస్తే రాజకీయంగా కొంత ప్రయోజనం చేకూరుతుందని చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఇద్దరూ భావించినట్లు తెలిసింది. నిజానికి నాగబాబుకు సామాజికవర్గం కూడా శాపంగా మారింది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కేబినెట్ లో జనసేన నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు. పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ లు ఉన్నారు. అందులో నాదెండ్ల మనోహర్ మినహాయిస్తే మిగిలిన ఇద్దరు కాపు సామాజికవర్గానికి చెందిన వారు. నాగబాబుకు కూడా పదవి ఇస్తే నలుగురిలో ముగ్గురు కాపు సామాజికవర్గానికి చెందిన వారికి మంత్రి పదవులు ఇచ్చినట్లవుతుంది.
కాపుల్లో అసంతృప్తి...
అలాగే తెలుగుదేశం పార్టీలో నూ కాపు సామాజికవర్గానికి చెందిన ఇద్దరికి టీడీపీ కూడా మంత్రి పదవులు ఇచ్చింది. పొంగూరు నారాయణ, నిమ్మల రామానాయుడు కూడా కేబినెట్ లో ఉండటంతో ఎక్కువ మంది కాపులకు కేబినెట్ లో అవకాశం ఇచ్చినట్లవుతుందన్న భావన కలుగుతుందని చంద్రబాబు నాయుడు కూడా పవన్ తో చెప్పినట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీలోనూ కాపు సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు అనేక మంది మంత్రి పదవి కోసంఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగబాబును మంత్రివర్గంలో తీసుకుంటే కాపు సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఒకింత అసంతృప్తికి లోనయ్యే అవకాశముందన్న అంచనాలు కూడా మంత్రిపదవి దక్కకపోవడానికి కారణంగా చెబుతున్నారు.
రాజకీయ నేత కాకపోవడంతో...
నాగబాబు రాజకీయ నేత కాదు. ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశం లేదు. ప్రజల్లో నేరుగా గెలిచింది లేదు. ఇప్పటి వరకూ ఎమ్మెల్సీలకు చంద్రబాబు మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. ఎమ్మెల్సీగా ఒకరికి అవకాశమిస్తే వారి నుంచి కూడా డిమాండ్ అధికమవుతుందని అంటున్నారు. సినిమా నటుడిగా ప్రజల్లోకి పెద్దగా తిరగలేని నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చినందున ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువని భావించి చంద్రబాబు పవన్ కల్యాణ్ కు నచ్చ చెప్పి అంగీకరింప చేసినట్లుతెలిసింది. మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడంతోనే నాగబాబు కూడా ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా కనిపించకపోవడానికి కారణమిదేనని అంటున్నారు. మొత్తం మీద నాగబాబుకు మంత్రి పదవి దక్కడం ఇప్పట్లో లేనట్లే కనిపిస్తుంది.